శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 26 ఆగస్టు 2015 (15:13 IST)

కేసీఆర్ తాగుబోతు కాబట్టే.. తెలంగాణలో చీప్ లిక్కర్: శోభారాణి

తెలంగాణ సీఎం కేసీఆర్ తాగుబోతు కాబట్టే తాగుబోతులను ప్రోత్సహిస్తున్నారని టీడీపీ మహిళా నేత శోభారాణి తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణలో చీప్ లిక్కర్‌ను తీసుకురాబోతున్న కేసీఆర్‌పై శోభారాణి తీవ్రంగా విమర్శలు గుప్పించారు. ఇక మంత్రులు చీప్ లిక్కర్ బాటిళ్లు పట్టుకుని బ్రాండ్ అంబాసిడర్లలా వ్యవహరించడం బాధాకరమని శోభారాణి వ్యాఖ్యానించారు.
 
తెలంగాణ రాష్ట్రంలో చీప్ లిక్కర్‌ను ఉపసంహరించుకోకపోతే తాము చీపుర్లు పట్టుకోవాల్సి వస్తుందని విమర్శించారు. చీప్ లిక్కర్‌కు వ్యతిరేకంగా అన్ని పార్టీలు ఏకతాటిపైకి రావాలని, వచ్చే నెల 1, 2 తేదీల్లో చీప్ లిక్కర్‌పై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామని శోభారాణి చెప్పారు.
 
ఇదిలా ఉంటే.. గుడుంబాతో పేద ప్రజల ప్రాణాలు పోగొట్టుకోరాదనే చీప్ లిక్కర్‌ను తెచ్చామని తెలంగాణ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వానికి 500 కోట్ల రూపాయలు నష్టం వచ్చే అవకాశం ఉన్నప్పటికీ చీప్ లిక్కర్‌ను అందుబాటులోకి తెస్తున్నామన్నారు. 
 
గుడుంబాను అరికట్టేందుకు చీప్ లిక్కరే సరైన పరిష్కారమని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ప్రతిపక్షాల ప్రచారానికి ప్రజలు ఎలాంటి గందరగోళానికి గురికావద్దని ఆయన పిలుపునిచ్చారు. సంక్షేమ కార్యక్రమాల అమలులో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ అని ఆయన పేర్కొన్నారు.