గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 29 ఆగస్టు 2014 (13:37 IST)

ఏపీ రాజధానిపై టీడీపీ మంత్రుల తలోమాట.. బాబు అసహనం!

ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానికి అనువైన ప్రాంతాన్ని ఎంపికపై టీడీపీకి చెందిన అధికార పార్టీ మంత్రులు తలోరకంగా స్పందిస్తున్నారు. ముఖ్యంగా.. ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రాజధాని నిర్మాణాన్ని వికేంద్రీకరించటమే శరణ్యమంటూ కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ తన ప్రాథమిక నివేదికలో తేల్చిచెప్పడంతో పలువురు పలు విధాలుగా మాట్లాడుతున్నారు. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కల్పించుకుని రాజధానిపై చర్చ వద్దని హితవు పలికారు. 
 
నివేదికలోని అంశాలు కొందరికి సంతృప్తి కలిగించగా మరికొందరికి ఏమాత్రం రుచించలేదు. కొత్త రాజధాని విజయవాడ - గుంటూరు మధ్యలోనే ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్తూ వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే తెరవెనుక రియల్ ఎస్టేట్ వ్యవహారాలను చక్కదిద్దుకుంటున్న పలువురు టీడీపీ నేతలకు కమిటీ సూచనలు మింగుడుపడలేదు.
  
నివేదికపై రాష్ట్ర మంత్రులు అసెంబ్లీ లాబీల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తపరిచారు. అవన్నీ ఎప్పటికప్పుడు టీవీ చానళ్లలో స్క్రోలింగ్‌ల రూపంలో రావడంతో అసెంబ్లీలో తన చాంబర్లో ఉన్న సీఎం చంద్రబాబు వారందరినీ హడావుడిగా పిలిచి సమావేశం నిర్వహించారు. రాజధానిపై ఇష్టానుసారం వారు మాట్లాడవద్దని హుకుం జారీచేశారు.
 
రాజధానిపై అంతా రాష్ట్ర ప్రభుత్వం అనుకున్నట్లే జరుగుతుందని, కంగారు పడాల్సిన అవసరం లేదని మంత్రులకు బాబు సూచించారు. ‘రాజధానిపై మంత్రులు తలోరకంగా మాట్లాడితే కొత్త సమస్యలు వస్తాయి. అంతిమంగా నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వమే తీసుకుంటుంది’ అని పేర్కొన్నారు. ‘రాజధానిపై మీడియా ఎవరిష్టానుసారం వారు ప్రచారం చేస్తున్నారు. రాజధాని ఎక్కడనే అంశంపై ఏదీ తేలకుండానే ఏవేవో ప్రాంతాలను ప్రచారంలో పెడుతూ బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు.