శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : ఆదివారం, 31 ఆగస్టు 2014 (13:18 IST)

ఏపీ రాజధాని కోసం రూ.4.5 లక్షల కోట్లు : శివరామకృష్ణన్ కమిటీ!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం 4.5 లక్షల కోట్ల రూపాయలు అవసరమవుతాయని కేంద్రం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ తన నివేదికలో పేర్కొంది. కేంద్ర హోంశాఖకు సమర్పించిన 187 పేజీల నివేదికలో రాజధాని ఎక్కడ ఉండాలన్న అంశాన్ని మాత్రం స్పష్టంగా పేర్కొనకుండా, తుది నిర్ణయం తీసుకునే వెసులుబాటును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికే వదిలివేసింది. కేవలం సలహాలకే పరిమితం. రాజధాని నిర్మాణంతో ముడిపడి ఉన్న అనేక అంశాలపై కమిటీ లోతుగా అధ్యయనం చేసింది. ఇతర రాష్ట్రాలు ఎదుర్కొన్న అనుభవాలను నివేదికలో పొందుపర్చింది.
 
విజయవాడ - గుంటూరు ప్రాంతాల మధ్య రాజధాని రావాలని ముఖ్యమంత్రి, ఆయన మంత్రివర్గ సహచరులతో పాటు.. మెజార్టీ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఈ రెండు నగరాలే తప్పించి ఇతర ప్రాంతాలు రాజధానికి అనుకూలంగా లేవని భావించటం సరికాదని ఎస్ కమిటీ పేర్కొంది. ఈ రెండు ప్రాంతాలతోపాటు గ్రేటర్ విశాఖ, నెల్లూరు, తిరుపతి, కడప, అనంతపురం ప్రాంతాలకు రాజధానిగా అభివృద్ధి చెందటానికి కావలసిన సత్తా ఉంది. రాజధాని నిర్మాణానికి ప్రాథమికంగా 1500 ఎకరాల భూమి కావాల్సి ఉంటుంది. ఇంత పెద్ద మొత్తంలో భూమి ఒకేచోట లభించే అవకాశాలు లేవు. భవిష్యత్‌లో రాజధాని విస్తరిస్తే, డిమాండ్ 15 వేల ఎకరాల వరకూ పెరిగే సూచనలు ఉన్నాయి.
 
అలాగే, రాజధాని నిర్మాణానికి రూ.4.5 లక్షల కోట్ల నిధులు కావాల్సి ఉంటుందని పేర్కొంది. ఇందులో భవనాల నిర్మాణానికి 10,519 కోట్లు, ప్రాథమిక సదుపాయల కల్పనకు 1536 కోట్లు, ఇప్పుడున్న సదుపాయాల మెరుగుదలకు 5861 కోట్లు, రాజభవన్ నిర్మాణానికి 1271 కోట్లు, డైరక్టరేట్ల నిర్మాణానికి 6000 కోట్లు, అతిథి భవనాల నిర్మాణానికి 210 కోట్లు ఖర్చవుతుందని కమిటీ అంచనా వేసింది. రాజ్‌భవన్‌కు 15 ఎకరాలు, విధాన సభకు 80నుంచి 100 ఎకరాలు, హైకోర్టుకు 100 ఎకరాల భూమి కావాల్సి ఉంటుందని కమిటీ అంచనా వేసింది.