శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 13 జులై 2018 (09:13 IST)

విషం చిమ్మిన స్టీల్ ప్లాంట్... గాల్లో కలిసిన ఆరుగురి ప్రాణాలు

అనంతపురం జిల్లా తాడిపత్రిలోని కల్యాణి గెర్డావ్‌ స్టీల్‌ ప్లాంట్‌ నుంచి విషవాయువులు వెలువడ్డాయి. ఈ వాయువులు పీల్చిన కార్మికుల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.

అనంతపురం జిల్లా తాడిపత్రిలోని కల్యాణి గెర్డావ్‌ స్టీల్‌ ప్లాంట్‌ నుంచి విషవాయువులు వెలువడ్డాయి. ఈ వాయువులు పీల్చిన కార్మికుల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.
 
ఈ ప్లాంటులో వెలువడే కార్బన్‌డయాక్సైడ్‌ను బయటకు పంపించడానికి ప్రత్యేకంగా పైపు ఏర్పాటు చేశారు. ఆ పైపు లీక్‌ కావడంతో విష వాయువు ప్లాంటు అంతా అలుముకొంది. కార్మికులంతా ఊపిరి తీసుకోవడానికి అల్లాడిపోయారు. 9 మంది అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. 
 
ప్రమాదం విషయం తెలియగానే తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆస్పత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు చెరో రూ.ఐదు లక్షలు చొప్పున ఇవ్వనున్నట్టు ప్రకటించారు. అలాగే, స్పర్శ సేవాసంస్థ ద్వారా ఒక్కొక్కరికి మరో రూ.లక్ష ఇవ్వనున్నట్లు చెప్పారు.
 
మరోవైపు ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించింది. సీఎస్‌ఐ నుంచి ప్రతి నెలా వారి కుటుంబాలకు పింఛను అందేలా, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. మృతిచెందిన ఉద్యోగుల అనుభవాన్ని బట్టి, వారి కుటుంబాలకు రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల చొప్పున కంపెనీ నుంచీ ఇప్పిస్తామని భరోసా ఇచ్చింది. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల నష్టపరిహారాన్ని ప్రకటించింది. 
 
మృతుల్లో రంగనాథ్‌(21), మనోజ్‌(24), గంగాధర్‌(37), వశీంబాషా(26), గురువయ్య(40), శివమద్దిలేటి(26) ఉన్నట్టు పోలీసులు తెలిపారు. వీరిలో ఇద్దరు కంపెనీ, ముగ్గురు కాంట్రాక్టు ఉద్యోగులు. ఒకరు ట్రైనీ. ప్లాంట్‌ యాజమాన్యంపై క్రిమినల్‌ కేసు నమోదు చేస్తున్నట్టు జిల్లా ఎస్పీ తెలిపారు.