శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 18 ఆగస్టు 2014 (11:39 IST)

చైన్ స్నాచర్ శివ మృతి: ఒంటరైన ఏకైక కుమారుడు!

తల్లిదండ్రులు చేసే దొంగపనికి కుమారుడి భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. శంషాబాద్‌లో జరిగిన పోలీసు కాల్పుల్లో చనిపోయిన కరుడుగట్టిన చైన్ స్నాచర్ శివ గ్యాంగ్ సభ్యులు విచారణలో వెల్లడించిన అంశాలు పోలీసుల దిమ్మెతిరిగి పోయే వాస్తవాలు వెలుగు చూశాయి. 
 
ఈ గ్యాంగ్ గత రెండేళ్లలో సైబరాబాద్, హైదరాబాద్, మెదక్ జిల్లాలలో 300 వరకు స్నాచింగ్‌లకు పాల్పడి ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. విచారణలో 700 స్నాచింగ్‌లకు పాల్పడినట్లు నిందితులు వెల్లడించారు.
 
ఇందులో సైబరాబాద్ పరిధిలోనే 500  చోరీలకు పాల్పడ్డారు. అందులో ఈ ఏడాది 250 స్నాచింగ్‌లకు పాల్పడి రికార్డు సృష్టించారని క్రైమ్ ఇన్‌చార్జి డీసీపీ జి.జానకీషర్మిల, ఏసీపీ రామ్ కుమార్‌లు తెలిపారు. శుక్రవారం అర్ధరాత్రి శంషాబాద్‌లో జరిగిన పోలీసు కాల్పుల్లో గ్యాంగ్‌లీడర్ శివ మృతి చెందగా అతని భార్య నాగలక్ష్మి (30)తో పాటు అతని ఇద్దరు అనుచరులు జగదీష్ (30), రాజ్‌కుమార్ (23)లను సైబారాబాద్ క్రైమ్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు.
 
వీరి నుంచి రూ. 30 లక్షల విలువైన 30 తులాల బంగారు ఆభరణాలు, రెండు కార్లు, రెండు బైక్‌లతో పాటు అతని ఇంట్లో ఉన్న విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. 
 
రాజమండ్రికి చెందిన నాగలక్ష్మి, ఆమె సోదరి జూనియర్ ఆర్టిస్టుల య్యేందుకు 2005లో హై దరాబాద్‌కు వచ్చి కృష్ణానగర్‌లో స్థిరపడ్డారు. సోదరి టీవీ జూనియర్ ఆర్టిస్ట్‌గా చేరింది. కృష్ణానగర్‌లోని బంధువుల వద్దకు వచ్చే క్రమంలో నాగలక్ష్మితో శివకు పరిచయం ఏర్పడి ప్రేమ వివాహం చేసుకున్నారు.
 
భర్త చేసే నేరాలలో తాను సైతం పాల్గొని పతిభక్తి చాటుకుంది నాగలక్ష్మి. ఆమె రెక్కీ ని ర్వహించి గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే శివ అతని అనుచరులు జగదీష్, రాజ్‌కుమార్ రంగంలోకి దిగి స్నాచింగ్ చేసేవారు. 
 
అయితే నెల్లూరులో ఉంటున్న శివ తల్లిదండ్రులు ప్రసన్న, మస్తానయ్య కుమారుడు శివ నేరబాట పట్టడంతో అతనిపై ఆశలు వదిలేసుకున్నారు. కాల్పుల్లో చనిపోయాడని తెలిసి కన్నీరుపెట్టారు. అయితే, ఆఖరి చూపు చూసేందుకు నిరాకరించారు. దీంతో పోలీసులు శివ మృతదేహాన్ని కృష్ణానగర్‌లో ఉంటున్న తోడల్లుడు దుర్గాప్రసాద్‌కు అప్పగించగా.. ఇక్కడే ఆదివా రం అంత్యక్రియలు పూర్తి చేశారు. 
 
ఒంటరైన కొడుకు... ఒకపక్క తండ్రి శివ మృతదేహం.. మరోపక్క చూద్దామంటే కనిపించని తల్లి నాగలక్ష్మి... దీంతో  దిక్కుతోచని స్థితిలో ఉన్న వారి ఏకైక కుమారుడు శ్రీను (4)ను చూసి స్థానికులు కన్నీరుపెట్టారు. ఇక శివ ఇంట్లో పెరుగుతున్న ఉదయ్‌సాయి (8) తోడల్లుడి కుమారుడని తెలిసింది. కాగా శివ ఏకైక కుమారుడు శ్రీను భవిష్యత్ ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది