శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Updated : బుధవారం, 4 మార్చి 2015 (12:29 IST)

నిద్రలేని రాత్రిళ్లు ఎన్నో.. మా గోడు పట్టించుకుంటేగా.. జగన్ కు రైతుల మొర

‘రాజధాని భూ సేకరణ వచ్చిన తరువాత ఎన్నో రాత్రిళ్లు నిద్ర లేకుండా గడిపాము.. నోటి కాడ కూడు తియ్యొద్దని మొత్తుకుంటున్నాం. విని వాడుంటేనా.. భూములు ఇచ్చేయండి.. భూములు ఇచ్చేయండీ ఇదే మాట.. భూము ఇచ్చేస్తే మేమెట్టా బతకాల.. పిల్లల్ని ఎట్టా సాకాలా... ఉన్న్యోళ్ళు అయితే ఇచ్చేస్తారేమో.. మేమీలేం. ’ ఇది రాజధాని రైతుల గోడు. మంగళవారం జగన్ ఎదుట వారు తమ గోడును వెళ్లబోసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. 
 
వైఎస్ ఆర్ సిపి నేత జగన్మోహన్ రెడ్డి మంగళవారం తాడేపల్లి మండలంలోని ఉండవల్లి, పెనుమాక గ్రామాల్లో వైఎస్ జగన్ పర్యటించారు. ఈ సందర్భంగా పలువురు రైతులతో మాట్లాడారు. ప్రభుత్వ ఒత్తిడికి భయపడి భూములిస్తున్నామని ఉండవల్లి రైతులు వాపోయారు.  పోలీసులను పెట్టి భూములను లాక్కుంటున్నారని తుళ్లూరు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబానికి 30 ఎకరాల భూమి ఉండవల్లిలో ఉందని ఇంతవరకు భూ సమీకరణలో పాల్గొనలేదన్నారు. అన్నదమ్ములం కలిసి 30 ఎకరాలు సాగు చేసుకుంటున్నామన్నారు. ప్రభుత్వం ఇష్టం లేకపోయినా భూములను తమ నుంచి లాక్కునే ప్రయత్నం చేస్తోందని మరో రైతు చెప్పారు.  
 
పొలాలు లాక్కుంటే భవిష్యత్తులో కూలీలుగా మారడం తప్పం మరోదారి లేదనీ, గ్రామంలో గల రెండు ఎకరాల్లో అరటి, ఉల్లి, దొండ, పంటలు వేసి ఏడాదికి వచ్చే రెండున్నర లక్షల రూపాయల ఆదాయంతో ఇద్దరు పిల్లలను చదివించుకుంటున్నామని ఇప్పుడు ఉన్న భూములు లాక్కుంటే ఎట్టా అంటూ మహిళా రైతు వాపోయారు. 
 
ప్రభుత్వం భూములు లాక్కుని ఏడాదికి 50 వేలు పరిహారం ఇస్తానంటే ఎలా బతకాలని ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో నిద్రపోను, నిద్రపోనివ్వను అంటూ చెప్పిన సిఎం చంద్రబాబు ఎసిల్లో నిద్రిస్తూ తమకు మాత్రం నిద్రలేకుండా చేశాడని అంకమ్మరెడ్డి ఆక్రోశించారు. ప్రతిబజారులో పోలీసులు నిలబడి తమను వేధిస్తున్నారని ఆరోపించారు.  ఎన్ని చెప్పినా తాము భూముల్లు ఇవ్వబోమని తేల్చి చెప్పారు. వారికి తాను అండగా ఉంటానని జగన్ భరోసా ఇచ్చారు.