మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Updated : శుక్రవారం, 4 సెప్టెంబరు 2015 (08:00 IST)

స్మార్ట్ అంటే అదే... అన్ని సౌకర్యాలు ఉంటాయి.. వెంకయ్య

ఆర్థిక, పర్యావరణ ప్రభావం అంశాలను దృష్టిలో పెట్టుకొని పోటీ పద్ధతుల్లో రెండో దశ స్మార్ట్‌ సిటీల అభివృద్ధికి ప్రణాళికలు రచిస్తామని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. స్మార్టు సిటీలలో అన్ని సౌకర్యాలు ఉంటాయని చెప్పారు. స్మార్ట్‌ సిటీ అంటే.. ఆ నగరాల్లో నివసించే ప్రజలు నిర్ణయించడమే అని స్పష్టం చేశారు. స్మార్టు సిటీ కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. అర్భన్ ప్రజల జీవన స్థితిగతులను మెరుగుపరచడమే లక్ష్యమన్నారు. 
 
గురువారం ఆయన స్మార్ట్‌ సిటీలపై ఉత్తరాది రాష్ట్రాల ప్రాంతీయ సదస్సును ప్రారంభించారు. ఈ సదస్సులో వివిధ రాష్ట్రాలల్లో స్మార్ట్‌ సిటీలుగా ఎంపికైన నగరాల మేయర్లు, మున్సిపల్‌ చైర్మన్లు పాల్గొన్నారు. ప్రజల అంచనాలకు అనుగుణంగా పట్టణాన్ని అభివృద్ధి చేయడానికి నిబద్ధతతో పనిచేయాలి. వచ్చే ఎన్నికల గురించి ఆందోళన చెందకుండా ప్రజలు మిమ్మల్ని జ్ఞాపకం ఉంచుకునేలా పనిచేయాలని వెంకయ్య వ్యాఖ్యానించారు. 
 
కాగా, స్మార్ట్‌ సిటీ తొలిదశలో ఎంపికైన నగరాల అభివృద్ధి కోసం కేంద్రం రూ.192 కోట్లను విడుదల చేసింది. ఒక్కో నగరానికి 2 కోట్ల చొప్పున మొత్తం 96 నగరాలకు గానూ ఈ నిధులను విడుదల చేసినట్లు వెల్లడించింది. ఈ నిధులను ప్రణాళికల రూపకల్పనకు వినియోగించుకోవాలని సూచించింది.