గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 26 ఆగస్టు 2014 (11:47 IST)

స్నేక్ గ్యాంగ్: ఇన్‌స్పెక్టర్‌పై వేటు, అసలు సంగతేంటి? పోలీసుల ఆరా!

పాతబస్తీలోని ఫాంహౌస్‌లో యువతిపై గ్యాంగ్ రేప్ చేసిన స్నేక్ గ్యాంగ్ విషయంలో నిర్లక్ష్యం వహించారనే ఆరోపణపై పహాడీ షరీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ డి.భాస్కర్‌రెడ్డిపై వేటు పడింది. స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ డి.భాస్కర్‌ రెడ్డిని వీఆర్‌ (వేకెన్సీ రిజర్వ్‌)లోకి పంపుతూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. భాస్కర్‌రెడ్డి స్థానంలో కళింగరావును ఇన్‌స్పెక్టర్‌గా నియమించారు. 
 
తనకు కాబోయే భర్తతో పాటు పామ్‌హౌస్‌కు వచ్చిన ఓ యువతిపై ఏడుగురు స్నేక్ గ్యాంగ్ సభ్యులు అత్యంత అమానుషమైన రీతిలో సామూహిక అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ కేసులోని నిందితులు న్యాయస్థానంలో లొంగిపోవడానికి సహకరించినవారెవరు, నిందితుడు ఖాదర్‌ బారక్‌బ తండ్రి ఆలీ బారక్‌బ ఒక్కరేనా లేదా పోలీసుల పాత్ర ఉందా? సమాధానం వెతికే పనిలో పడ్డారు. 
 
దానిపై సైబరాబాద్‌ పోలీసు ఉన్నతాధికారులు ఒక నిర్ధారణకు వచ్చినట్లు మంగళవారం మీడియాలో వార్తలు వచ్చాయి. సామూహిక అత్యాచారం చేసిన తర్వాత నిందితులు ఫైసల్‌ దయానీ, ఖాదర్‌ బారక్‌బ, సలామ, పర్వేజ్‌, సయ్యద్‌ అన్వర్‌, ఖాజా అహ్మద్‌, మహ్మద్‌ ఇబ్రహీం పరారయ్యారు. వీరిలో ఖాదర్‌ బారక్‌బ, సయ్యద్‌ అన్వర్‌, ఖాజా అహ్మద్‌ 11న రంగారెడ్డి కోర్టులో లొంగిపోయారు. 
 
మరో ముగ్గురు నిందితులు సలామ, మహ్మద్‌ పర్వేజ్‌, మహ్మద్‌ ఇబ్రహీంలను పోలీసులు మూడో తేదీన అరెస్టు చేశారు. అప్పటికీ ప్రధాన నిందితుడు ఫైసల్‌ దయానీ పరారీలోనే ఉన్నాడు. 11న నిందితులు కోర్టులో లొంగిపోడానికి ఖాదర్‌ బారక్‌బ తండ్రి ఆలీ బారక్‌బ సహకరించాడు. వారికి ఈ సలహా ఇచ్చింది మాత్రం పహాడీషరీఫ్‌ స్టేషన్‌లోని ఒక ఎస్‌ఐ అని తేలినట్లు వార్తలు వచ్చాయి. 
 
మరో రెండు రోజులు ఆలస్యమై ఉంటే దయానీ పోలీసులకు చిక్కకుండా కోర్టులో లొంగిపోయేవాడు. అయితే గత నెల 31న వీరు సామూహిక అత్యాచార సంఘటనకు సంబంధించి అన్ని వివరాలూ తెలుసుకున్న సైబరాబాద్‌ కమిషనర్‌ సివి ఆనంద్‌ పహాడీషరీఫ్‌ పోలీసులపై తీవ్రంగా మండిపడ్డారు.
 
ప్రధాన నిందితుణ్ని అరెస్టు చేసి తీరాల్సిందేనని ఆదేశాలు జారీ చేశారు. దీంతో తప్పనిసరి పరిస్థితిలో పోలీసులు దయానీని అరెస్టు చేశారని అంటున్నారు. కోర్టులో లొంగిపోయిన నిందితులను కస్టడీలోకి తీసుకుని లొంగుబాటు వెనుక నడిచిన అసలు కథను బయటకు లాగాలని అధికారులు ఆలోచిస్తున్నట్లు సమాచారం. రెండు, మూడు రోజుల్లో కోర్టులో కస్టడీ పిటిషన్‌ దాఖలు చేయబోతున్నారు.