బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 8 సెప్టెంబరు 2016 (08:20 IST)

ప్రత్యేక హోదా ఇవ్వలేం.. దానికి తగ్గకుండా సాయం.. ఏపీకి రూ.1.50 లక్షల కోట్ల ప్యాకేజీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై రాజ్యసభలో నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ చేసిన ప్రకటనను గౌరవిస్తూ, ప్రత్యేక హోదాతో కలిగే ఆర్థిక ప్రయోజనాలకు సమానమైన మొత్తాన్ని 2015 నుంచి ఐదేళ్లపాటు ఏపీకి అంది

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై రాజ్యసభలో నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ చేసిన ప్రకటనను గౌరవిస్తూ, ప్రత్యేక హోదాతో కలిగే ఆర్థిక ప్రయోజనాలకు సమానమైన మొత్తాన్ని 2015 నుంచి ఐదేళ్లపాటు ఏపీకి అందిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. హోదాకు సమానమైన మొత్తాన్ని.. విదేశీ ఆర్థిక రుణ సంస్థల సాయంతో చేపట్టే (ఈఏపీ) ప్రాజెక్టులకు అందిస్తామని తెలిపారు. 2014 ఏప్రిల్‌ 1 తేదీ నుంచి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఎంత ఖర్చయితే అంత మొత్తాన్ని వంద శాతం కేంద్రమే భరిస్తుందని ప్రకటించారు.
 
14వ ఆర్థిక సంఘం సిఫార్సుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధ్యం కాదని తేల్చి చెప్పారు. అయితే, ప్రత్యేక హోదా ఇవ్వలేకున్నా... ప్రత్యేక హోదాతో ఎంతమేర ప్రయోజనం చేకూరుతుందో అంతే స్థాయిలో ప్రత్యేక ప్యాకేజీ ఇస్తున్నట్టు బుధవారం రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత ప్రకటించారు. ఆర్థిక శాఖ కసరత్తు పూర్తి కాని నేపథ్యంలో ఆయా అంశాలపై నిధుల లెక్క కాకుండా... వివరణ మాత్రమే ఇస్తూ జైట్లీ ప్రకటన సాగిపోయింది.
 
విశ్వసనీయ సమాచారం ప్రకారం నిధుల వివరాలు సుమారు ఇలా ఉన్నాయి. 
పోలవరం ప్రాజక్టుకు ఇచ్చే నిధులు... రూ.32 వేల కోట్లు
ఈఏపీ రుణం ద్వారా అందే నిధులు... రూ.30 వేల కోట్లు
మౌలిక సౌకర్యాలకు అందే నిధులు... రూ.25 వేల కోట్లు
ఓడరేవుల నిర్మాణానికి ఇచ్చే నిధులు... రూ.20 వేల కోట్లు
ఆర్థిక లోటు భర్తీకి అందే నిధులు... రూ.10 వేల కోట్లు
అమరావతి నిర్మాణానికి ఇచ్చే నిధులు...రూ. 10 వేల కోట్లు (15 వేల కోట్ల దాకా పెరిగే అవకాశం)
కారిడార్ నిర్మాణానికి ఇచ్చే నిధులు... రూ.12 వేల కోట్లు
వెనుకబడిన జిల్లాలకు నిధులు... రూ.2 వేల కోట్లు