మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : ఆదివారం, 26 అక్టోబరు 2014 (10:41 IST)

శ్రీశైలంపై సుప్రీంకోర్టుకు వెళ్తామన్న కేసీఆర్.. స్వాగతించిన చంద్రబాబు!

శ్రీశైలం విద్యుత్ వాడకంపై ఆంధ్రప్రదేశ్‌ సర్కారును సుప్రీంకోర్టుకు ఈడుస్తామన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన ప్రకటనను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు.. ఆ రాష్ట్ర ఇంధన శాఖ ఉన్నతాధికారులు పరోక్షంగా స్వాగతిస్తున్నారు. విద్యుత్‌ వివాదంపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళితేనే మంచిదని భావిస్తున్నారు. ‘విద్యుత్‌ విషయంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో ఎంత త్వరగా వ్యాజ్యం వేస్తే అంత మంచిది. పరస్పరం విమర్శలు గుప్పించుకునే పరిస్థితి తప్పుతుంది. ఎవరైనా అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పునకు కట్టుబడి ఉండాల్సి ఉంటుంది’ అని ఏపీ ఇంధన అధికారులు గుర్తు చేస్తున్నారు. 
 
రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్‌ కంటే తెలంగాణ ప్రభుత్వమే ఎక్కువ కరెంటు వాడుకుందని వారు గుర్తు చేస్తున్నారు. ‘థర్మల్‌ విద్యుత్తు తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్‌ 90 మిలియన్‌ యూనిట్లు అధికంగా వాడుకుంది. అదే జల విద్యుత్తు విషయానికి వస్తే ఏపీ కంటే తెలంగాణ 153 మిలియన్‌ యూనిట్లు ఎక్కువగా వాడుకుంది. నికరంగా చూస్తే... మాకంటే తెలంగాణ రాష్ట్రం 63.3 మిలియన్‌ యూనిట్లు అధికంగా వాడింది’ అని ఏపీ అధికారులు లెక్కలు చెపుతున్నారు. ఈ గణాంకాలు ఎస్‌ఆర్‌ఎల్‌డీసీ వద్ద నమోదైనవేనని, తాము సొంతంగా చెబుతున్నవి కావని గుర్తు చేశారు. 
 
రాష్ట్ర విడిపోయిన తర్వాత గత జూన్‌ 18 నుంచి ఈనెల 21వ తేదీ దాకా మొత్తం 14,564 మిలియన్‌ యూనిట్ల విద్యుదుత్పత్తి జరిగింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌ వాటా 6716 మిలియన్‌ యూనిట్లు. కానీ, 6652 మిలియన్‌ యూనిట్లు మాత్రమే వాడుకున్నాం. అంటే... 63.3 మిలియన్‌ యూనిట్లు తక్కువ వాడాం. ఇక.. తెలంగాణకు జరిగిన కేటాయింపు 7849 మిలియన్‌ యూనిట్లుకాగా, 7912 మిలియన్‌ యూనిట్లు వాడుకున్నారు. అంటే, అదనంగా 63.3 మిలియన్‌ యూనిట్లు వాడారని వారు చెప్పుకొచ్చారు.