బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Updated : శనివారం, 4 జులై 2015 (10:12 IST)

రైతులకు దిగులక్కరలేదు...ఆత్మహత్యలకు పాల్పడవద్దు.. చంద్రబాబు

కరువు వెంటపడుతోందనీ, ఆదాయాలు లేవని దిగులు పడి ఆత్మహత్యలకు పాల్పడాల్సిన పనిలేదని.. కాలం ఎప్పుడూ ఒకలా ఉండదనీ, భారీ ప్రాజెక్టులకు ప్రణాళిక చేస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులకు భరోసా ఇచ్చారు. శుక్రవారం అనంతపురం జిల్లా జీడిపల్లి సాగునీటి ప్రాజెక్టులను పరిశీలించారు. హంద్రినీవా పనులను సమీక్షించారు. 
 
అనంతరం రిజర్వాయర్‌ పంప్‌హౌస్‌, ఆక్విడెక్ట్‌ పనులను తనిఖీ చేశారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ పంట నష్టపోయి రైతులు అధైర్యపడిపోతున్నారని ఆత్మహత్య పరిష్కారం కాదని, రైతన్నలు ధైర్యంగా ఉండాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. రైతులు ఆత్మగౌరవంతో బతకాలనే ఉద్దేశంతో రుణమాఫీ అమలు చేశామన్నారు. 
 
ఉరవకొండలో రైతు ఆత్మహత్య చేసుకోవడం తనకు చాలా బాధ కలిగించిందన్నారు. పట్టాదారు పాసుపుస్తకం ఇవ్వకపోవడం వల్ల మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తా పత్రికలో చదివానన్నారు. ఇకపైన వీటి అవసరం లేకుండా పరిపాలనలో సంస్కరణలు తీసుకు వస్తామన్నారు. అలాగే ఆదాయం, కులం, తదితర సర్టిఫికెట్ల అవసరం లేకుండా కూడా చర్యలు తీసుకుంటామన్నారు. 
 
పేదవారిని వేధింపులకు గురి చేయకుండా ఆదుకుంటామన్నారు. 90 లక్షల మంది డ్వాక్రా మహిళలకు రూ.10 వేల చొప్పున పెట్టుబడి నిధిని మంజూరు చేశామన్నారు. పేదవారి సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నానని, ఈ విషయంపై ప్రతిఒక్కరూ చర్చించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలోనే అనంతపురాన్ని నెంబర్‌ 1 జిల్లాగా తీర్చిదిద్దుతామన్నారు. కరువు జిల్లాకు మంచి రోజులు వచ్చాయన్నారు.