మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr

తెలంగాణలో సన్ స్ట్రోక్...! పారుకుని... తల విదిలించుకుని...40 లక్షల కోళ్ళు మృతి

తెలంగాణలో కోళ్ల పరిశ్రమకు మరో కొత్త రోగం వచ్చిపడింది. సన్ స్ట్రోక్ (సన్ స్ట్రోక్)తో లక్షల కోళ్లు పారుకుని.. తల విదిలించుకుంటూ ఎక్కడ ఉన్న కోళ్ళు అక్కడే చనిపోతున్నాయి. తెలంగాణ కోళ్ళఫారాలలోంచి వేలాదిగా చనిపోయిన కోళ్ళను బయట పడేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. పొయ్యిమీద వేయకుండానే కోళ్ళు ఉడికిపోతున్నాయి. అవి తినడానికి కూడా  పనికిరాకుండా పోతున్నాయి. ఒక్క తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే వారం రోజుల్లో 40 లక్షల కోళ్ళు మృత్యువాత పడ్డాయి. వివరాలిలా ఉన్నాయి. 
 
వారం రోజులుగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో కోళ్ల ఫారాల్లో కోళ్లు లక్షల సంఖ్యలో మృతి చెందుతున్నాయి. రాష్ట్రంలో 20 వేల కోళ్లఫారాలున్నాయి. వాటిల్లో 5.50 కోట్ల కోళ్లున్నాయి. అందులో 3.50 కోట్ల లేయర్ కోళ్లు, 2 కోట్ల బాయిలర్ కోళ్లున్నాయి. ఇవిగాక మరో 60 లక్షల హేచరీ కోళ్లున్నాయి. సాధారణంగా 35 డిగ్రీల సెల్సియస్‌కు మించి ఉష్ణోగ్రతలు నమోదయితే కోళ్లకు వడదెబ్బ తగలకుండా ఫారాల యజమానులు నీళ్లు చల్లడం వంటి జాగ్రత్తలు తీసుకుంటారు.
 
జాగ్రత్తలు తీసుకుంటే 42 డిగ్రీల ఉష్ణోగ్రత వరకు కోళ్లు తట్టుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ పర్యాయం ఉష్ణోగ్రతలు కనీసం 44 కు తగ్గకుండా ఉండడంతో వేడి పెరిగిపోయింది. గత వారం రోజుల్లో దాదాపు 40 లక్షల కోళ్లు మృతిచెందాయి. వేడికి తట్టుకోలేక తిన్నతిన్నట్లే పారుకోవడం.. తల విదిలించుకుంటూ ఉన్న చోట అలాగే చనిపోతున్నాయి. భారీ ఎత్తున కోళ్ళు చనిపోవడంతో వ్యాపారులకు రూ. 50 కోట్ల మేర నష్టం వాటిల్లిందని పౌల్ట్రీ బ్రీడర్స్ అసోసియేషన్ భావిస్తోంది. ఇటీవల బర్డ్‌ఫ్లూతో నష్టపోయిన వ్యాపారులకు భారీ ఎండలతో కోళ్లు చనిపోయి నష్టాన్ని చవిచూస్తున్నారు.