గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , మంగళవారం, 10 జనవరి 2017 (04:03 IST)

కృష్ణా జలాలపై తెలంగాణ వాదన చెల్లదన్న సుప్రీంకోర్టు

తెలంగాణ ప్రభుత్వం దూకుడుతనానికి, మొండి వైఖరికి ఇటీవల కాలంలో వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. దీంట్లో భాగంగానే, కృష్ణాజలాల పంపిణీపై జస్టిస్‌ బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ తీర్పును సవాల్‌ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం వేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం నాడు కొట్టివేసింది. రాష్ట్ర పునర్‌ విభజన చట్టంలోని సెక్షన్‌ 89(ఎ), (బి) ప్రకారం ప్రాజెక్టులవారీ కేటాయింపులు, నీటి లభ్యత రెండు తెలుగు రాష్ట్రాలకు మాత్రమే వర్తింపజేస్తూ బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ తీర్పునిచ్చిన విషయంతెలిసిందే. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. 
 
కృష్ణా పరివాహక ప్రాంతంలోని మహారాష్ట్ర, కర్నాటక, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను పరిగణలోకి తీసుకొని నీటి పంపకాలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి వాదిస్తోంది. ఉమ్మడి రాష్ట్రంగా ఉంటూ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన ఏపీ, తెలంగాణాకు మాత్రమే కృష్ణానీటిని ట్రిబ్యునల్‌ పంపకాలు చేయడం వల్ల తెలంగాణాకు తీవ్ర అన్యాయం జరుగుతుందని తెలంగాణ సర్కార్‌ ఆక్షేపించింది. బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ నాలుగు రాష్ట్రాలకు నీటి పంపకాలు చేయాలని తెలంగాణ సర్కార్‌ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీన్ని ధర్మాసనం కొట్టివేస్తూ మిగతా పిటిషన్లపై విచారణ కొనసాగుతుందని స్పష్టం చేసింది.
 
కృష్ణాజలాల కేటాయింపుపై రెండు రాష్ట్రాలు ఎవరి వాదనకు వారే కట్టుబడటంతో నదీ యాజమాన్య బోర్డే నేరుగా రంగంలోకి దిగింది. ఆరురకాల ప్రత్యామ్నాయాలు తయారుచేసి ఇందులో ఒకదానికి మొగ్గుచూపింది. దీనిప్రకారం ప్రధాన రిజర్వాయర్లలో నిల్వఉన్న నీటిలో ఆంధ్రప్రదేశ్‌కు 87 టీఎంసీలు, తెలంగాణకు 43 టీఎంసీలు వస్తాయని స్పష్టంచేసింది. పట్టిసీమ ద్వారా మళ్లించే నీటివాటాపై కృష్ణాజల వివాద ట్రెబ్యునల్‌ లేదా కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ నియమించిన కమిటీ నిర్ణయం తీసుకోవాలని బోర్డు అభిప్రాయపడింది. 
 
గత సెప్టెంబరు 21న జరిగిన అపెక్‌‌స కౌన్సిల్‌ నిర్ణయం మేరకు పట్టిసీమ ద్వారా మళ్లించే నీటిపై కృష్ణాజల వివాద ట్రెబ్యునల్‌-2 నిర్ణయం తీసుకోవాలన్నారు. తర్వాత ఇదే అంశాన్ని కేంద్రజలవనరుల మంత్రిత్వశాఖ నియమించిన కమిటీకి అప్పగించారని, అపెక్స్ కౌన్సిల్‌ నిర్ణయం మేరకు కమిటీ పునర్నిర్మాణం జరగాల్సి ఉందని సభ్య కార్యదర్శి పేర్కొన్నారు. కృష్ణాబేసిన్‌లో మిగిలిన నీరు పంపిణీకి బోర్డు ఆరు ప్రత్యామ్నాయాలను ఇరురాష్ట్రాల దృష్టికి తీసుకెళ్లిన విషయం తెలిసిందే.
 
కొత్త రాష్ట్రంగా తనకు రావలసిన హక్కుల విషయమై శ్రుతిమించి ప్రవర్తిస్తున్న తెలంగాణ దూకుడుకు ఏపీ తెలంగాణ హైకోర్టు, ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా పగ్గాలు బిగించడంతో కేసీఆర్ ప్రభుత్వం చేష్ట్యలుడిగిపోయింది. దాని భవిష్యత్ కార్యాచరణ సుప్రీ తీర్పుతో అగమ్య గోచరంగా మారింది.