బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 25 ఫిబ్రవరి 2016 (15:23 IST)

తెలుగు రాష్ట్రాల్లో ఆగని సురేష్ ప్రభు రైలు.. విశాఖ రైల్వే జోన్ ఊసే లేదు.. కేటాయింపులివే

కేంద్ర రైల్వేమంత్రి సురేష్ ప్రభు గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్‌పై తెలుగు రాష్ట్రాల నేతలు పెదవి విరుస్తున్నారు. ఈ బడ్జెట్ సాదాసీదాగా ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. ఎలాంటి కొత్త రైళ్లు, రైల్వే లైన్లు లేకుండానే బడ్జెట్‌ను ముగించారని అంటున్నారు. రైల్వేల్లో పరిశుభ్రతపైనే దృష్టిసారించారు. ఆహార సదుపాయాలు, భద్రతకు పెద్దపీట వేశారు. రైల్వే చార్జీలను యధాతథంగా ఉంచారు.
 
ముఖ్యంగా సురేశ్ ప్రభు రైలు తెలుగు రాష్ట్రాల్లో ఆగకుండానే జెట్ స్పీడ్ వేగంతో దూసుకెళ్లిందన్నారు. విశాఖ రైల్వే జోన్, కాజీపేట డివిజన్ ప్రస్తావనే లేకపోవడం తీవ్ర నిరాశకు లోనుచేసింది. పుణ్యక్షేత్రాలకు సర్క్యూల్ ట్రైన్ నడుపుతామని ప్రకటించిన రైల్వే మంత్రి వాటిలో తిరుపతి పేరును చేర్చడం కాస్తంత ఊరటనిచ్చే అంశం. అలాగే నాగ్‌పూర్ నుంచి విజయవాడ వరకు ట్రేడ్ కారిడార్‌ను ప్రకటించారు. మరికొన్ని రైళ్ల ఫ్రీక్వెన్సీ పెంచడంలాంటి ప్రకటనలు ఉన్నా అంతిమంగా సురేశ్ ప్రభు రైలు తెలుగు రాష్ట్రాలను మరిచిపోయింది. అయితే, తెలంగాణ ప్రభుత్వం సహకారంతో ఎంఎంటీఎస్‌ను అభివృద్ధి చేస్తామని ప్రకటించారే కానీ నిధుల కేటాయింపు ఊసెత్తకుండా ముగించేశారు. 
 
ఇకపోతే ఏపీ రాష్ట్ర విభజనలో ఇచ్చిన హామీ ప్రకారం బడ్జెట్‌లో విశాఖకు రైల్వేజోన్ వస్తుందని అంతా ఆశించగా, ఆ మాట కూడా ప్రస్తావించలేదు. అంతేకాకుండా కొత్త రైళ్లను ఏర్పాటు చేయాలంటూ ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల విజ్ఞప్తులను కేంద్రం పెడచెవినపెట్టింది. దేశవ్యాప్తంగానూ సురేశ్ ప్రభు ఎలాంటి కొత్త రైళ్ల ప్రతిపాదనలను తీసుకురాలేదు. మౌలిక సదుపాయాల కల్పనకే రైల్వే మంత్రి అధిక ప్రాధాన్యతనిచ్చారు. అలాగే, తెలుగు రాష్ట్రాలకు కేటాయించిన కేటాయింపులను ఓసారి పరిశీలిస్తే.. 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిఠాపురం - కాకినాడకు రైల్వేలైన్‌కు రూ.50 కోట్లు, కోటిపల్లి - నరసాపురం రైల్వేలైన్‌కు రూ.200 కోట్లు కేటాయించారు. అలాగే, తెలంగాణ రాష్ట్రంలో పెద్దపల్లి - నిజామాబాద్ రైల్వే లైన్‌కు రూ.70 కోట్లు, మునీరాబాద్ - మహబూబ్ నగర్ రైల్వే లైన్‌కు రూ.180 కోట్లు, మాచర్ల - నల్గొండ రైల్వే లైన్‌కు రూ.20 కోట్లు, కాజీపేట - విజయవాడ మూడో రైల్వే లైన్‌కు రూ.114 కోట్లు, రాఘవాపురం - మందమర్రి రైల్వే లైన్‌కు రూ.15 కోట్లు, సికింద్రాబాద్ - మహబూబ్ నగర్ డబ్లింగ్‌కు రూ.80 కోట్లు, పెద్దపల్లి - జగిత్యాల సబ్‌వే నిర్మాణానికి రూ.5 కోట్లు, కాజీపేట - వరంగల్‌ మధ్య ఆర్‌వోబీ నిర్మాణానికి రూ.5 కోట్లు, మనోహరాబాద్ ‌- కొత్తపల్లి లైన్‌కు రూ.20 కోట్లు, నిజామాబాద్‌ ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణానికి రూ.10 కోట్లు చొప్పున నిధులు కేటాయించి, బోధన్ - బీదర్‌ కొత్త లైన్‌ మంజూరు చేశారు.