గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Modified: మంగళవారం, 5 మే 2015 (08:13 IST)

శ్రీకాళహస్తిలో తెలుగు తమ్ముళ్ల తడాఖా.. ఆలయ సిబ్బందిపై దౌర్జన్యం

మా పార్టీ అధికారంలో ఉంటే తమను కాదని, మరొకరికి ఎలా టెండర్లు దక్కేలా చేస్తారంటూ శ్రీకాళహస్తిలో తెలుగు తమ్ముళ్లు ఆలయ సిబ్బందిప విరుచుకుపడ్డారు. ఆలయ కార్యాలయంలోకి చొరబడి వారిని కొట్టినంత పని చేశారు. అక్కడ కార్యాలయంలో సిబ్బంది ఎదుటే వీరంగం వేశారు. టెండర్లు ఎలా దక్కించుకోవాలో తమకు తెలుసునంటూ నానా హంగామా చేశారు. భీతిల్లిన సిబ్బంది నోరు మెదపకుండా కూర్చుండిపోయారు. వివరాలిలా ఉన్నాయి. 
 
నాలుగు రోజుల క్రితం ఆలయ పరిపాలన భవనంలో సెక్యూరిటీ,అన్నదానం సిబ్బంది కోసం టెండర్లు జరిగాయి. ఈ టెండర్లలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, మున్సిపల్ కౌన్సిలర్లు శరవణ్‌కుమార్,చిర్రి నాగేశ్వరరావు కూడా టెండర్లలో పాల్గొన్నారు. అయితే ఈ టెండర్లు హైదరాబాద్ కు చెందిన వారిని దక్కాయనే సమాచారం వారికి పొక్కింది. దీంతో శరవణ్ కుమార్ , చిర్రి నాగేశ్వర రావు సోమవారం తమ అనుచరులతో ఆలయ పరిపాలన భవనంలోకి ప్రవేశించారు. 
 
వచ్చిన రావడమే ఎస్టాబ్లిస్‌మెంట్ విభాగ అధికారి రవిశంకర్‌తో వాగ్వివాదానికి దిగారు. ఇంత మంది ఒక్కసారిగా కార్యాలయంలోకి చొరబడడంతో కార్యాలయ సిబ్బంది బిత్తరపోయారు. తాము కలుగజేసుకుంటే ఎక్కడ తమకు ఇబ్బంది కలుగుతుందోనని నోరుమెదపకుండా ఉండిపోయారు. నిబంధనల ప్రకారం తామే తక్కువగా కోడ్ చేసినా స్థానిక నాయకుల ఒత్తిళ్లతో హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తికి టెండర్ ఎలా కట్టబెడతారని అధికారిని కొట్టినంత పని చేశారు. అలా చేస్తే తాము ఊరుకోమని హెచ్చరించారు. 
 
మార్చిలో ఇదే టెండర్లలో తామే తక్కువగా కోడ్ చేస్తే రాజకీయాలు చేసి వాటిని రద్దు చేసి ఏప్రిల్‌లో మరోసారి టెండర్లు నిర్వహించారని, రెండోసారి తామే తక్కువకు కోడ్ చేసినా నాయకుల ఒత్తిళ్లతో,ముడుపులకు ఆశపడి హైదరాబాద్‌వాసికి టెండర్ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అధికారి రవిశంకర్ ఆలయ టెండర్ల విషయంలో నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తున్నామని, ఎక్కడా అవినీతికి పాల్పడలేదని సమాధానమిచ్చారు. అక్కడికి వారు తెలుగు తమ్ముళ్లు ఆగలేదు. అధికారం మా చేతుల్లో ఉండగా మీరు ఏం చేస్తారో చూస్తాం అంటూ వీరంగం వేశారు. ఎలా టెం డర్లు దక్కించుకోవాలో తెలుసని కౌన్సిలర్లు వెళ్లిపోయారు.