శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : ఆదివారం, 29 మార్చి 2015 (14:54 IST)

అట్టహాసంగా తెదేపా ఆవిర్భావ దినోత్సవం!

ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో తెలుగుదేశం పార్టీ 34వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొని పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. నాయకులు, కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేశారు. 
 
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ‘ఎన్టీఆర్ యుగపురుషుడు. రాజకీయాలకు గౌరవం తెచ్చిన నాయకుడు. భౌగోళికంగా విడిపోయినా తెలుగువారంతా ఒక్కటే. తెలుగుజాతి కోసం తెలుగుదేశం పార్టీ నిరంతరం పాటుపడుతుంది’ అన్నారు. 
 
తెలంగాణలోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరింతగా కష్టపడాలని పిలుపునిచ్చారు. తనకు రెండు తెలుగు రాష్ట్రాలూ ముఖ్యమేనని, తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు కార్యకర్తలే కీలకమని అన్నారు. ఎన్టీఆర్‌కు భారతరత్న గౌరవాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు. 
 
ఈ కార్యక్రమంలో నారా లోకేష్, ఏపీ మంత్రి అయ్యన్నపాత్రుడు, తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్.రమణ, మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్, పార్టీ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు, అరవింద్ గౌడ్, పెద్దిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.