శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Updated : శనివారం, 30 మే 2015 (06:39 IST)

తెలుగుదేశం పార్టీ విశ్వవిద్యాలయంలాంటిది... చంద్రబాబు

తెలుగు రాష్ట్రాలలో తెలుగుదేశం పార్టీ ఎందరో నాయకులను తయారుచేసిందని, ఇదో విశ్వవిద్యాలయంలాంటిదని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం మహానాడులో జాతీయ అధ్యక్షుడుగా ఎన్నికైన ఆయన ఎన్టీయార్ విగ్రహానికి పూల వేశారు. అనంతరం మాట్లాడుతూ, ఎవ్వరూ ఏమీ చేయలేరని, తెలుగు జాతి ఉన్నంత కాలం తెలుగుదేశం పార్టీ ఉంటుందని చంద్రబాబు పేర్కొన్నారు.
 
ఇతర పార్టీలకు నాయకులను తయారు చేసుకునే శక్తి లేక తమ పార్టీ నాయకులను తీసుకుని పదవులు ఇస్తున్నారని విమర్శించారు. తనకు గుర్తింపు వచ్చిందంటే కార్యకర్తల కృషి ఫలితమే అని, కొందరు కార్యకర్తలు పార్టీ కోసం తమ ఆస్తులు పోగొట్టుకున్నారని, అలాంటి వారిని ఆదుకుంటాం చంద్రబాబు హామీ ఇచ్చారు. కార్యకర్తలు లేకుండా పార్టీ లేదు, తాను లేను అని వ్యాఖ్యానించారు.
 
స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆశయ సాధనకు పునరంకితం కావాలని కార్యకర్తలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. కార్యకర్తల జీవితాలు బాగుచేసే బాధ్యత పార్టీదేనని స్పష్టం చేశారు. ఏడాదికి 5 వేల మంది కార్యకర్తల పిల్లలకు ఉద్యోగాలు ఇప్పిస్తామని, కుటుంబ పెద్దగా కార్యకర్తలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. పార్టీలో కార్యకర్తలకు గుర్తింపు, గౌరవం ఉండాలని నేతలకు సూచించారు. మహానాడులో పార్టీకి రూ. 12 కోట్ల విరాళాలు వచ్చాయని, వీటిని కార్యకర్తల బాగుకోసం వినియోగిస్తామని చెప్పారు. నాయకులు నిత్య విద్యార్థుల్లా ఉండాలని సూచించారు.
 
తెలంగాణ నాయకులు ఎప్పటికప్పుడు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ పోరాటాలు సాగించాలని చంద్రబాబు టిటిడిపి నేతలకు పిలుపునిచ్చారు. అదేవిధంగా తెలంగాణ ప్రజలకు నేతలు దగ్గర కావాలన్నారు. టీడీపీని టీఆర్‌ఎస్‌ తక్కువగా అంచనా వేస్తోందని, టీఆర్‌ఎస్‌ నాయకుడు ఎక్కడ పుట్టారో తెలుసుకోవాలని చంద్రబాబు వ్యాఖ్యానించారు.