బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : శనివారం, 29 ఆగస్టు 2015 (09:11 IST)

ప్రత్యేక హోదా.. ప్రత్యేక ప్యాకేజీ.. ఏది మంచిదైతే అదే కావాలి : టీడీపీ

ప్రత్యేక హోదా.. ప్రత్యేక ప్యాకేజీ... వీటిలో ఏది బెస్ట్. ఇదే చర్చ అధికార టీడీపీ నేతల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్రం తెగేసి చెప్పింది. అయితే, హోదా కంటే ఎక్కువ మేలుచేసే ప్యాకేజీ ఇస్తామని హామీ ఇస్తోంది. కానీ, విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన సీమాంధ్రులు ప్రత్యేక హోదానే కావాలని కోరుతున్నారు. దీంతో ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ అనే రెండు అంశాలపై జోరుగా చర్చ సాగుతోంది. 
 
ఇదే అంశంపై టీడీపీ నేతలు స్పందిస్తూ ‘ఏపీకి ప్రత్యేక హోదా కావాలి... ప్రత్యేక ప్యాకేజీ కూడా కావాలి. వీటిలో ఏది మంచిదైతే అది రాష్ట్రానికి రావాలి. దానిపై చర్చ జరగాలి. ప్రత్యేక ప్యాకేజీలు ఎన్ని ఇచ్చినా తీసుకొంటాం. అదేసమయంలో ప్రత్యేక హోదా కోసం మా కృషి కొనసాగిస్తాం. రాష్ట్రానికి అవసరమైన దేనినీ వదిలిపెట్టం’ అని అంటున్నారు. 
 
రాష్ట్రానికి ఇచ్చిన హామీల అమలులో బీజేపీకి చిత్తశుద్ధి ఉందని తమ పార్టీ భావిస్తున్నదన్నారు. ‘మేం పదే పదే ఆ పార్టీకి ఈ విషయాలను గుర్తు చేస్తున్నాం. ప్రత్యేక హోదా ఇవ్వబోమని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ఎక్కడా చెప్పలేదు. దీనిపై చర్చిస్తున్నామన్నారు. చంద్రబాబు ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత దీనికి సంబంధించిన ప్రక్రియ కదిలింది. ఒకటి రెండు రోజులు ఆలస్యం కావచ్చుగానీ రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని మేం విశ్వసిస్తున్నాం. నీతి ఆయోగ్‌కు దీనికి సంబంధించిన బాధ్యతను కేంద్రం అప్పగించింది. అంతా సవ్యంగానే జరుగుతుందని ఆశిస్తున్నాం’ అని పేర్కొంటున్నారు.