శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ttdj
Last Modified: మంగళవారం, 24 మే 2016 (11:55 IST)

తిరుపతిలో చివరి దశకు చేరుకున్న మహానాడు ఏర్పాట్లు

తిరుపతిలో మహానాడు ఏర్పాట్లు చివరి దశకు చేరుకున్నాయి. గత వారంరోజులుగా 100 మందికిపైగా కూలీలు కష్టపడి మహానాడు పనులను చకాచకా చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న తెలుగుదేశంపార్టీ నాయకులు, కార్యకర్తలు మహానాడుకు తరలిరానుండడంతో వారికి ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లను చేస్తున్నారు. శ్రీవారి పాదాల చెంత అతి దగ్గరగా నెహ్రూ మున్సిపల్‌ సభాస్థలి ఉంది. తెలుగుదేశంపార్టీ సెంటిమెంట్‌గానే ఈ సభాస్థలిని మహానాడుకు ఎంచుకుంది. గతంలో ఒకసారి మహానాడు ఇదే సభాస్థలిలో జరిగింది. ఇది రెండోసారి. ఇప్పటికే మహానాడు ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. 30 వేల మంది టిడిపి నాయకులు, కార్యకర్తలు కూర్చునే విధంగా సభాస్థలిని రూపు దిద్దారు. సభావేదికపై సీనియర్‌ నాయకులు ఆశీనులయ్యేలా వేదికను సిద్ధం చేశారు.
 
సిఎం, పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు మహానాడు వేదికపై మధ్యలో కూర్చునే విధంగా అదిపెద్ద చైర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. మహానాడు చుట్టుపక్కల మొత్తం కూలర్లను ఏర్పాటు చేస్తున్నారు. సభావేదికపై మాత్రమే ఎసిలను బిగిస్తున్నారు. ఎండవేడిమి ఎక్కువగా ఉండడంతో కూలర్లను తీసుకువచ్చి బిగిస్తున్నారు. అలాగే సభాస్థలికి పక్కనే మరుగుదొడ్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. భోజనం విషయానికొస్తే రాయలసీమ రుచులను మాత్రమే వండే విధంగా ఇప్పటికే మెనును కూడా సిద్ధం చేశారు. తెలుగుదేశంపార్టీకి చెందిన సీనియర్‌ నాయకులందరు ఇప్పటికే తిరుపతికి ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. ఈనెల 27,28,29తేదీలలో మూడురోజుల పాటు మహానాడు జరుగనుంది. 
 
విచిత్రం....
 
తిరుపతిలో జరుగనున్న తెలుగుదేశంపార్టీ మహానాడుకు అన్ని హంగులు అమర్చుతున్నారు. మహానాడుకు తరలివస్తున్న అతిరథ మహారథులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఉండేందుకు సకల వసతులు కల్పిస్తున్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని ప్రాంగణంలో చల్లదనం కోసం అధునాతమైన ఏసీలు తెప్పించారు. రాజు తలుచుకుంటే కానిది ఏమున్నది అన్న సామెత ఒకటి ఉంది కదా. అదేవిధంగా అభంశుభం తెలియని ఓ పసివాడు ఈ హడావిడి అర్థంకాక దీనంగా చూస్తున్నాడు. ఒకేచోట ఇంత పెద్దపెద్ద కూలర్లు, వేదిక ఏర్పాట్లు చూసిన ఈ పనివాడు ఆశ్చర్యానికి గురై ముక్కున వేలేసుకున్నాడు.
 
ప్రధాన ఎన్నికల తరువాత మొదటిసారి తిరుపతిలో తెలుగుదేశంపార్టీ అతి పెద్ద కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇప్పటివరకు ఏ పార్టీ కూడా ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించలేదు. అసలే అధికారంలో ఉన్న పార్టీ. ఇక ఏవిధంగా చేస్తారో చెప్పనవసరం లేదు. టిడిపి ముందు నుంచి మహానాడంటే ఎంతో గొప్పగా చేస్తోంది. అధికారంలో ఉన్నా, లేకున్నా తెలుగుదేశంపార్టీ మాత్రం మహానాడును పండుగలా చేస్తోంది. అదేవిధంగా ఈ సారి జరుగుతున్న మహానాడును గతంలో జరిగిన దానికన్నా ఎక్కువ ఆర్భాటం చేసేలా ప్రయత్నం చేస్తోంది.