బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ttdj
Last Updated : శుక్రవారం, 27 మే 2016 (15:41 IST)

తిరుపతి తెదేపా మహానాడుకు హరికృష్ణ - జూఎన్టీఆర్ డుమ్మా.. పార్టీకి దూరమైనట్టేనా?

తిరుపతిలో శుక్రవారం ప్రారంభమైన తెలుగుదేశం పార్టీ మహానాడుకు ఆ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు, సినీ నటుడు నందమూరి హరికృష్ణ, ఆయన తనయుడు, హీరో జూనియర్ ఎన్టీఆర్ హాజరుకాలేదు. వీరిద్దరి గైర్హాజరుపై పలురకాలైన కథనాలు వినిపిస్తున్నాయి. 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పార్టీని స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారాన్ని చేజిక్కించుకున్న ఒకే ఒక్క వ్యక్తి ఎన్టీఆర్. తెలుగు ప్రజల ఆరాధ్యదైవంగా సినీరంగంలో వెలుగు వెలిగారు. ఆయన తర్వాత ఆ బాధ్యతలను అల్లుడు చంద్రబాబు నాయుడు భుజానెక్కించుకున్నారు. అయితే బాధ్యతలను చంద్రబాబు నెత్తిన వేసుకున్నా ఎన్టీఆర్ కుమారులకు మాత్రం పార్టీలో పెద్ద పీట వేశారు. బాలకృష్ణకు ఎమ్మెల్యే పదవి ఇవ్వగా, హరికృష్ణను రాజ్యసభ సభ్యుడిగా చేశారు. 
 
కానీ, శుక్రవారం తిరుపతిలో ప్రారంభమైన మహానాడుకు మాత్రం బాలకృష్ణ ఒక్కరే హాజరయ్యారు. హరికృష్ణ లేదా ఈయన తనయుడు జనియర్ ఎన్టీఆర్ హాజరుకాలేదు. ప్రతియేడాది జరిగే మహానాడులో హరికృష్ణ హాజరవుతూనే ఉన్నారు. అయితే ఈసారి జరిగిన మహానాడులో హరికృష్ణ రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. తెదేపా మహానాడులో విస్తృత చర్చకు దారితీసింది. హరికృష్ణ రాకపోవడానికి బలమైన కారణాలు ఉన్నాయంటున్నారు ఆ పార్టీ నేతలు. 
 
ఆయన ఎంపి సీటు పదవీకాలం ముగియడం దాంతో పాటు పార్టీ కార్యక్రమాలకు చాలా రోజులుగా హరికృష్ణ దూరంగా ఉంటూ వస్తున్నారు. గతంలో ఎప్పుడూ చురుగ్గా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే హరికృష్ణ ఇపుడు అసలు తెదేపా కార్యక్రమాలకే రాకపోవడం మరింత చర్చకు దారితీస్తోంది. గత కొన్నినెలలుగా చంద్రబాబుతో కూడా ఆయన సరిగ్గా మాట్లాడడం లేదని సమాచారం. 
 
అయితే మరికొంతమంది మాత్రం రేపు ఎన్‌టిఆర్‌ ఘాట్‌లో నివాళులర్పించేందుకు హైదరాబాద్‌లోనే ఉండిపోయారని, అందుకోసమే ఆయన తిరుపతికి రాలేదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఏదిఏమైనా హరిక్రిష్ణ రాకపోవడం మాత్రం మహానాడులో హాట్‌ టాపిక్‌గా మారింది.