గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PYR
Last Updated : గురువారం, 29 జనవరి 2015 (09:15 IST)

కనీసం నేను మంత్రిననైనా తెలుసా...? నా నియోజకవర్గానికే గతి లేకపోతే ఎలా?

జిల్లాలో మంత్రిగా ఉన్నానైనా తెలుసా..? కనీసం నేనెవరో తెలుసా ? నేను ఈ జిల్లా వాసినే.. నా నియోజకవర్గానికే గతి లేకపోతే.. ఎలా చేయాలి? అధికారులు ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు. పాపం..! ఇది ఓ మంత్రి ఆవేదన. ఎక్కడో తెలుసా..? అధికారుల ఎదుటే.. ఎవరా మంత్రి..? ఏదా జిల్లా..? వివరాలు.. 
 
విజయనగరం జిల్లా చీపురుపల్లి గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి మృణాళిని స్వంత నియోజకవర్గం. ఈ నియోజకవర్గానికి సంబంధించిన కొన్ని సమస్యలు ఆమె దృష్టికి వచ్చాయి. అవి చాలా కాలం పరిష్కారం కాలేదు. దీంతో మంత్రి పశువైద్యశాఖ జేడి, ఏడిలను చీపురుపల్లెలోని ఎంపిడీవో కార్యాలయానికి పిలిపించారు. అక్కడ వారిని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. దీంతో వారిచ్చే సమాధానాలు చూసి ఆమెకు చిర్రెత్తిపోయింది. 
 
సమస్యలను, కారణాలను జెడ్పీటీసీ మీసాల సింహాచలం దృష్టికి తీసుకువచ్చామని ఏడి సమాధానం చెప్పడంతో మంత్రి మరోమారు ఆగ్రహం చెందారు. ‘ఆయనతో ఈయనతో చెప్పడం ఎందుకు? నేరుగా నా వద్దకే వచ్చి చెప్పాలి కదా...ఏం మీరు చదువుకున్న వారే కదా.. మీ ఆస్పత్రిలో సమస్యలు మీరు వచ్చి చెప్ప లేరా’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఎవరో వస్తారు.. ఏదో చేస్తారనుకోవడం మానేసి, ఉద్యోగులు తమ కార్యాలయాల్లో ఏం సమస్యలు ఉన్నాయో గుర్తించండి’. ‘నా అంతకు నేను గుర్తించి, ఫోన్‌లు చేసినంత వరకు కలవకపోతే ఎలా?’ అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘అసలు నేనెవరో అయినా తెలుసా... కనీసం ఇది ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గమని అయినా తెలుసా..?’ అంటూ క్లాసు పీకారు. 
 
తరువాత అధికారులు మంత్రి ఎదుట తమ సమస్యల చిట్టా విప్పారు. చీపురుపల్లి పశువైద్యశాల సొంత భవనం పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. పది సెంట్లు స్థలం ఉంటే సొంత భవనానికి నిధులు మంజూరవు తాయని జేడీ సింహాచలం చెప్పారు. స్థలం ఎక్కడైనా ఉంటే చూడాలని తహశీల్దార్ డి. పెంటయ్యను మంత్రి ఆదేశించారు. ఇంతలో జెడ్పీటీసీ మీసాల కలుగజేసుకుని మార్కెట్ యార్డు స్థలంలో చాలా ఖాళీ స్థలం ఉందని,అక్కడ నిర్మించుకుంటే బాగుంటందని సూచించారు. దీనికి మంత్రి సుముఖత వ్యక్తం చేస్తూ, సర్వే నంబర్లతో లేఖను తయారు చేయాలని తహశీల్దార్‌ను ఆదేశించారు.