నేను ఏ తప్పూ చేయలేదు... ఎమ్మెల్సీ కావడం ఇష్టంలేకే...
తాను ఏ తప్పూ చేయలేదని, రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే సీబీసీఐడీ విచారణ చేపట్టారని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు చెప్పారు. తాను ఎమ్మెల్సీ కావడం ఇష్టం లేక, అసూయ వల్ల డిపార్ట్ మెంట్ లో ఇష్టం లేని వారు చేసిన పని ఇది అని వెల్లడించారు.
డిగ్రీ సర్టిఫికెట్లు ఫోర్జరీ వ్యవహారంలో తనపై సీబీసీఐడీ ఎంక్వైరీ వేసినట్లు మీడియా ద్వారా తెలిసిందని అశోక్ బాబు చెప్పారు. ఇది పాత సబ్జెక్ట్ అని, టైపో గ్రాఫిక్ మిస్టేక్ వల్ల ఇది జరిగిందన్నారు. దీనిని నేరంగా పరిగణించి గతంలో నా ప్రత్యర్థులు వివాదం చేశారు. దాని ఫలితమే ఇవాళ నాపైన కేసు. నేను సర్వీసులో ఉండగా, కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్లని హెడ్ ఆఫీసుకు డిప్యుటేషన్ పై పిలిచారు. నా క్వాలిఫికేషన్ డిప్లమో ఇన్ కంప్యూటర్స్ అని నేను స్పష్టంగా చెప్పాను. డి.కామ్ ను బి.కామ్ గా టైప్ అవ్వడం వల్ల నేను తప్పుడు సమాచారం ఇచ్చానని నా ప్రత్యర్థులు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిగింది. 2019లోనే దానిని క్లోజ్ చేశారని తెలిపారు.
ఇందులో ఎలాంటి నేరపూరితం లేదని, ఎలాంటి బెనిఫిట్స్ పొందలేదని, పనిష్ మెంట్ సరికాదని విచారణ అధికారి కూడా తేల్చారు. నాపైన ఉన్న ఛార్జస్ అన్నీ డ్రాప్ అయి మూడేళ్లు దాటింది. నేను టీడీపీలో ఎమ్మెల్సీ కావడం ఇష్టం లేక, అసూయ వల్ల నా డిపార్ట్ మెంట్ లో ఇష్టం లేని వారు చేసిన పని ఇది అని చెప్పారు. బి.మెహర్ కుమార్ అనే ఉద్యోగితో లోకాయుక్తలో పిటిషన్ పెట్టించారని, రాజకీయ కారణాలు కూడా ఈ ఫిర్యాదుకు కారణం అని, పీఆర్సీ స్ట్రగుల్ కమిటీలో సూర్యనారాయణ అనే వ్యక్తి ప్రోద్బలంతోనే ఇది జరిగిందన్నారు. మాకు వ్యతిరేకంగా అతను ఉండేవాడు. ఎన్జీవో ఆర్గనైజేషన్ లో కూడా నాపై పోటీకి వచ్చి ఓడిపోయాడు. ఎవరెన్ని ఫిర్యాదులు చేసినా, ఎన్ని రకాలు ప్రయత్నించినా ఏదీ సక్సెస్ కాలేదు. ఇది కూడా సక్సెస్ కాలేదన్నారు.
లోకాయుక్త నుంచి సీబీసీఐడీకి విచారణకు రావడం అనేది ఎంతవరకు చట్టబద్ధత ఉందదనేది చూడాలి. నేను చేయని పని ఇది. టైపో గ్రాఫిక్ మిస్టేక్. ప్రభుత్వం కూడా ఆనాడు డ్రాప్ అయింది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా నాకు వచ్చాయి. ఇది ఇష్టం లేని వారు కోర్టుకు వెళ్లి విఫలమయ్యారు. రాజకీయంగా దెబ్బతీయడానికి మళ్లీ తెరపైకి తీసుకువచ్చారు. ఉద్యోగులు ఆందోళన చేస్తున్నప్పుడు దీనిని తెరపైకి తీసుకురావడంలోనే రాజకీయం ఉంది. ప్రభుత్వ సొంత మనిషి సూర్యనారాయణ. ఆయన వెనుక ఎలాంటి ఆర్గనైజేషన్ లేదు. టీడీపీని వ్యతిరేకించాడు కాబట్టి ప్రభుత్వం సూర్యనారాయణను దగ్గరకు తీసింది. జీరోను హీరోను చేశారు. రిటైరై మూడేళ్ల తర్వాత నాపై సీబీసీఐడీ కేసు పెట్టడం రాజకీయంగా వెంటపడాలనే ఉద్దేశమే ఉంది. దీనిపై చట్టపరంగా తాను పోరాడతానని చెప్పారు.