గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 28 ఆగస్టు 2016 (15:48 IST)

'ప్రత్యేక హోదా' తీసుకొస్తే పవన్‌కు అనుచరుడిగా మారిపోతా : జేసీ దివాకర్

రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అనుచరుడిగా మారిపోతానని తెలుగుదేశం పార్టీకి చెందిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చెప్పారు. తిరుపతిలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్

రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అనుచరుడిగా మారిపోతానని తెలుగుదేశం పార్టీకి చెందిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చెప్పారు. తిరుపతిలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై జేసీ ఆదివారం స్పందించారు. 
 
ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీ ఎంపీలంతా రాజీనామా చేసినా ప్రధాని నరేంద్ర మోడీకి ఏమీ కాదన్నారు. టీడీపీ ఎంపీలందరం కలిసి పార్లమెంట్‌లో ఆందోళన చేశామని, అంతకంటే ఏం చేయాలని జేసీ ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం పవన్‌ స్పష్టమైన వైఖరితో రావాలని సూచించారు. హోదా తీసుకొస్తే పవన్‌కు అనుచరుడిగా మారిపోతానని జేసీ వ్యాఖ్యానించారు.
 
ఏపీకి ప్రత్యేక హోదా కావాలని ప్రధానికి స్పష్టంగా చెప్పామన్నారు. లేదంటే కాంగ్రెస్‌కు పట్టిన గతే మీకూ పడుతుందని కేంద్రాన్ని హెచ్చరించామని తెలిపారు. ఎన్నికలకు ముందువరకు ప్రధాని భయపడ్డారని, తమ మద్దతు లేకుంటే ప్రధాని కాలేననుకున్నారని, కానీ ఫలితాలు భిన్నంగా ఉండటంతో ఏపీ ఎంపీల పరిస్థితి కరివేపాకులా తయారైందని, ఎంపీలను మోడీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని జేసీ ఆరోపించారు.
 
ఇకపోతే హీరో పవన్‌కు అనుభవం తక్కువ, వయసు తక్కువన్నారు. ఏం చేయాలో పవన్‌ స్పష్టంగా చెప్పాలని జేసీ కోరారు. చంద్రబాబుకు ఏం తెలియదన్నట్టు మాట్లాడటం సరికాదని, రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు అవమానాలను భరిస్తున్నారని జేసీ గుర్తు చేశారు. తనకు ఎంపీ పదవి వెంట్రుకతో సమానమని, ప్రత్యేక హోదా వస్తుందనుకుంటే రాజీనామాకు సిద్ధమేనని జేసీ స్పష్టం చేశారు.
 
పైగా, ఇది సినిమా కాదని, నిజ జీవితమన్నారు. తమకు హిందీ రాకపోవచ్చు గానీ, ఇంగ్లీష్‌ వచ్చని చెప్పారు. ప్రత్యేక హోదా పదేళ్లు కావాలని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అడిగారని జేసీ గుర్తుచేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తెర వెనుక వెంకయ్య కృషి చేస్తున్నారన్నారు. విభజన సమయంలో కేంద్రమంత్రులు రాజీనామా చేసి ఉంటే ఈ అనర్థం జరిగి ఉండేది కాదని జేసీ అభిప్రాయపడ్డారు. చిరంజీవి తదితరులు పదవులను పట్టుకుని వేలాడటం వల్లే రాష్ట్రానికి ఈ పరిస్థితి దాపురించిందన్నారు.