గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 1 ఆగస్టు 2015 (13:08 IST)

బట్టలూడదీసుకుని తిరగాలా? బీజేపీకి ప్రత్యేక హోదా ఇష్టం లేదు: రాయపాటి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపై కేంద్రం చేసిన ప్రకటనతో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్న నేపథ్యంలో, ఏపీ ఎంపీలు హోదా విషయంలో మిన్నకుండిపోతున్నారని విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో రాయపాటి సాంబశివరావు సహనం కోల్పోయారు. ప్రత్యేక హోదాపై ఇంతకంటే ఏం చేయాలి? బట్టలూడదీసుకుని తిరగాలా? అంటూ తీవ్ర స్వరంతో వ్యాఖ్యానించారు. 
 
రాష్ట్రానికి ప్రత్యేక హోదా బీజేపీకి ఇష్టం లేదని, ఈ విషయంలో బీజేపీ మొండిగా వ్యవహరిస్తోందని విమర్శించారు. బీజేపీ సర్కారు తప్పు పని చేస్తోందని, మొదట యూపీఏ ప్రభుత్వం ప్రాథమికంగా తప్పు చేసిందని, ప్రస్తుతం బీజేపీ సర్కార్ ప్రత్యేక హోదా విషయంలో మొండిగా ఉందన్నారు. ఈ విషయంలో టీడీపీ, బీజేపీ పార్టీలలు నష్టం జరుగుతుందని, అసలు ప్రధాని నరేంద్ర మోడీ దేశంలో ఎప్పుడున్నారని, ఆయనది విజిటింగ్ వీసా అంటూ ఎద్దేవా చేశారు. 
 
కాగా.. రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదంటూ కేంద్రం చేసిన ప్రకటన ఏపీలో అధికార పక్ష నేతలకు మింగుడుపడడంలేదు. మంత్రులు మాత్రం ఆశావాదం కనబరుస్తుండగా, ఎంపీలు మాత్రం భిన్న స్వరం వినిపిస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా రాదన్న విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు సహా అందరికీ అర్థమైందని, ఇక నిధుల కోసం ప్రయత్నాలు జరుగుతాయని జేసీ దివాకర్ రెడ్డి సంచలన కామెంట్స్ సాధించిన సంగతి తెలిసిందే.