శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr

తెలంగాణ‌లో మంత్రివ‌ర్గ మ‌ర‌మ్మ‌త్తులు... కొత్త‌వారికి చోటు... కేసీఆర్ ఆలోచ‌న‌

తెలంగాణ మంత్రుల్లో కొందరికి ఉద్వాసన త‌ప్ప‌లేలా లేదు. కొంద‌ర‌ని ప‌ద‌వుల నుంచి తప్పించి అవే ప‌ద‌వుల‌ను మ‌రికొంద‌రికి క‌ట్ట‌బెట్టేందుకు రంగం సిద్ధ‌మ‌వుతోంది. ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చిన వారికి కూడా ప్రాధాన్య‌త క‌ల్పిస్తూ, మంత్రి వ‌ర్గంలో వారికి చోటు క‌ల్పించే అవ‌కాశాలు ఉన్నాయి.  రాష్ట్రంలో రాజకీయ పునరేకీకరణ జరుగుతున్న క్రమంలో కొత్తగా పార్టీలో చేరిన వారికి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పినట్లు సమాచారం. తద్వారా సీఎం కేసీఆర్‌ భవిష్యత్తులో తీసుకునే నిర్ణయాలపై పరోక్ష సంకేతాలు ఇచ్చారనే చర్చ టీఆర్‌ఎస్‌ ముఖ్యుల్లో జరుగుతోంది. ఇప్పుడున్న మంత్రివర్గంలో బొత్తిగా ఖాళీలు లేకపోవటం వల్లనే ఇప్పుడు పదవుల్లో ఉన్న వారిని తొలగించి, వారి స్థానాల్లో కొత్తగా మరికొందరిని తన కేబినెట్‌లో చేర్చుకోవటం కోసమే సీఎం కేసీఆర్‌ తన వ్యాఖ్యల ద్వారా పూర్వరంగాన్ని సిద్ధం చేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. 
 
గత ఏడాది జూన్‌ 2న రాష్ట్ర విభజన జరిగి.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన రోజే ముఖ్యమంత్రిగా కేసీఆర్‌, మరో 11 మంది మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేశారు. తిరిగి అదే ఏడాది డిసెంబర్‌ 16న మరో ఆరుగురు మంత్రివర్గంలో చేరారు. రాష్ట్రంలోని శాసనసభ్యుల దామాషా ప్రకారం ముఖ్యమంత్రిసహా కేబినెట్‌ సభ్యుల సంఖ్య 18 కంటే మించకూడదు. ఈ కారణంగానే ఈ ఏడాది జనవరిలో అప్పటి డిప్యూటీ సీఎం, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తాటికొండ రాజయ్యను మంత్రివర్గం నుంచి తొలగించాలనుకున్న సీఎం కేసీఆర్‌ ఆయనను కేబినెట్‌ నుంచి బర్తరఫ్‌ చేసిన తర్వాతనే ఆ స్థానంలో కడియం శ్రీహరిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. దరిమిలా మంత్రివర్గంలో సింగిల్‌ బెర్త్‌ కూడా ఖాళీగా లేదు. అయినప్పటికీ, సీఎం కేసీఆర్‌ ఇప్పటికే ఎంతో మందికి హామీలు ఇచ్చారు.. ఇస్తున్నారు. 
 
ఉద్యోగ సంఘాల నేతలుగా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించిన కె.స్వామిగౌడ్‌, వి.శ్రీనివా్‌సగౌడ్‌ టీఆర్‌ఎ్‌సలో చేరిన తర్వాత వారికి మంత్రి పదవులు ఇస్తానని ఓపెన్‌ ఆఫర్‌ ఇచ్చారు. పార్టీలో సీనియర్‌ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్‌కు మంత్రి పదవి ఇస్తానని చెప్పారు. అలాగే ఎమ్మెల్యే కొండా సురేఖసహా పార్టీ ఎమ్మెల్యేలలో పలువురు కేసీఆర్‌ నుంచి మంత్రి పదవి హామీలు పొందారు. ఇందులో స్వామిగౌడ్‌కు శాసన మండలి చైర్మన్‌ పదవి దక్కగా, కొప్పుల ఈశ్వర్‌కు డిప్యూటీ సీఎం నుంచి అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ వరకు అన్ని పదవులు ఊరించి చివరికి ప్రభుత్వ చీఫ్‌ పదవి వరించింది. మిగిలిన వారి పరిస్థితి ఇక అంతే సంగతులు. ఇటీవలి కాలంలో పార్టీ ఎమ్మెల్యే, తెలంగాణ సాంస్కృతిక సారథి రసమయి బాలకిషన్‌ను సాంస్కృతిక శాఖకు మంత్రిని చేస్తానని సీఎం కేసీఆర్‌ స్వయంగా ప్రకటించారు. 
 
తాజాగా కాంగ్రెస్‌ పార్టీని వీడిన సీనియర్‌ నేత డి.శ్రీనివాస్‌ తన మెడలో గులాబీ కండువా కప్పుకోవటానికి సిద్ధమయ్యారు. టీఆర్‌ఎస్‌ తరఫున డీఎస్‌ రాజ్యసభ సీటును ఆశిస్తున్నారని, పార్టీ అధినాయకత్వం మాత్రం ఆయనకు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పదవి ఇవ్వటానికి సుముఖంగా ఉందనే ప్రచారం జరుగుతోంది. రాజ్యసభ సీటు ఇవ్వకుండా డీఎ్‌సను ఎమ్మెల్సీని చేస్తే మాత్రం ఆయనకు మంత్రి పదవి ఇవ్వటం తప్పనిసరి అవుతుందని టీఆర్‌ఎస్‌ ముఖ్యులే అంగీకరిస్తున్నారు. 
 
మరోవైపు కాంగ్రెస్‌, టీడీపీల నుంచే కాకుండా బీజేపీ నుంచి కూడా పలువురు ప్రముఖులు రాబోయే రోజుల్లో టీఆర్‌ఎ్‌సలో చేరతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. వారిలో చాలా మంది మంత్రి పదవి నిర్వహించే స్థాయిలో ఉన్న వారేనని చెబుతున్నారు. మంత్రి పదవులు ఆశించే వారిలో సొంత పార్టీ వారు ఒక ఎత్తయితే, కొత్తగా పార్టీలో చేరే వారు మరొక ఎత్తు అవుతున్నారు. ఈక్రమంలో అందరినీ సర్దుబాటు చేయటం సీఎం కేసీఆర్‌కు తలనొప్పి వ్యవహారంగా మారిందని ఆయన సన్నిహితులు అంటున్నారు. 
 
కేబినెట్‌ బెర్త్‌లు ఖాళీ లేకపోవటంతో కొత్తగా ఎవరికి అవకాశం కల్పించాలన్నప్పటికీ, ప్రస్తుతం మంత్రులుగా ఉన్న వారికి ఉద్వాసన పలకటం తప్పనిసరని చెబుతున్నారు. సీఎం కేసీఆర్‌ తనంతట తానుగా కేబినెట్‌ నుంచి ఎవరినైనా మంత్రి పదవి నుంచి తొలగిస్తే అసంతృప్తి వెల్లువెత్తే దృష్ట్యా, కొందరు వాళ్లంతట వాళ్లు పార్టీ నిర్ణయాన్ని శిరసావహిస్తున్నామనే కారణంతో స్వచ్ఛందంగా మంత్రి పదవులు వదులుకునేలా చేయాలనేది టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం ముఖ్యుల వ్యూహంగా తెలుస్తోంది.