శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Updated : మంగళవారం, 30 జూన్ 2015 (20:15 IST)

గవర్నర్ విందుకు కేసీఆర్ దూరం... ఎందుకు? జ్వరమా..! బాబు ముఖం చూడటం ఇష్టం లేకా..!?

రాష్ట్రపతి వస్తున్నారు... ఆయనే విశిష్ట అతిథి. అవకాశం ఉంటే ఆయన బస చేసినంత కాలం ఆయనతో సమావేశమయ్యేందుకు ఏ ముఖ్యమంత్రి అయినా ప్రయత్నం చేస్తారు... ఆయనకు ఘనంగా స్వాగతం పలికి పాదాభివందనం చేసిన కేసీఆర్, గవర్నర్ రాష్ట్రపతికి ఇచ్చే విందుకు మాత్రం దూరంగా ఉన్నారు. జ్వరమనే కారణం చెబుతున్నా... దీని వెనుక బాబుతో ఉన్న విభేదాలే కారణమని తెలుస్తోంది. బాబుతో నేరుగా మాట్లాడటం లేదా బాబుతో కలిసి ఉండటం ఇష్టంలేకే ఆయన దూరంగా ఉన్నారనే వాదన వినిపిస్తోంది. 
 
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గౌరవార్థం గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఇస్తున్న విందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు దూరంగా ఉంటున్నారు. గత వారంలో నాలుగు రోజుల పాటు ఫాంహౌస్లోనే గడిపిన కేసీఆర్.. జ్వరంతో బాధపడుతున్నారని సీఎం కార్యాలయ వర్గాలు సోమవారమే ప్రకటించాయి. అసలు రాష్ట్రపతి రాక నుంచి నేటివరకూ అన్ని అంశాలను గమనిస్తే కేసీఆర్ ఆలోచన ఏమిటో స్పష్టంగా కనిపిస్తుంది. రాష్ట్రపతి విమానాశ్రయం తన పరిధిలోకి రావడంతో ప్రోటోకాల్‌లోకి బాబు రాలేకపోయారు. దీంతో ఇక్కడ ఆయను కలవాల్సిన పని కేసీఆర్‌కు లేకుండా పోయింది. 
 
ఇక రాష్ట్రపతి గౌరవార్థం ఇస్తున్న విందుకు కూడా కేసీఆర్ హాజరు కాకపోవడానికి అనారోగ్యం ఒక కారణంగానే చూపుతున్నారు. అయితే మరో కారణం ఉందని కూడా నేతలు అంటున్నారు. ఈ విందుకు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు హాజరవుతున్నారు. ఓటుకు నోటు కేసు బయటపడినప్పటి నుంచి ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది. త్వరలోనే చంద్రబాబుకు కూడా నోటీసులు ఇచ్చేందుకు తెలంగాణ ఏసీబీ సిద్ధమవుతోంది. 
 
ఇలాంటి పరిస్థితులలో విందుకు వెళ్ళితే అక్కడ కలసి ఉండాల్సి వస్తే చంద్రబాబుతో ఎడమొహం పెడమొహంగా ఉంటే ప్రథమ పౌరుడి ఎదుట పలుచనవుతామని భావించినట్లుంది. అలాగని కలిస్తే తాను ఇంతకాలం మాట్లాడిన మాటలకు అర్థం లేకుండా పోతుందని కేసీఆర్ భావించి ఉంటారని అనుకుంటున్నారు. అందుకే చంద్రబాబును కలవడం ఇష్టం లేకపోవడం వల్లే రాష్ట్రపతికి ఇస్తున్న విందుకు కూడా కేసీఆర్ దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది.