శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Updated : శనివారం, 29 ఆగస్టు 2015 (06:29 IST)

అక్కడ రిటైర్ అయిన ఉద్యోగులు... ఇక్కడ చేరవచ్చు... ఆంధ్ర ఆఫర్

రాష్ట్ర విభజన తరువాత చాలా మంది ఉద్యోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అక్కడి వారు ఇక్కడ, ఇక్కడి వారు అక్కడ గందరగోళమే పడుతున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణలో రిటైర్ అయిన ఉద్యోగులకు ఓ అవకాశం కల్పించింది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో పనిచేస్తూ 58 ఏళ్లకే రిటైర్‌ అయిన ఆంధ్రప్రదేశ్‌ ఉద్యోగులను తిరిగి సర్వీసులోకి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఉమ్మడి రాష్ట్రం విడిపోయి గతేడాది జూన్‌ 2వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలుగా అవతరించిన తర్వాత చాలా మంది ఉద్యోగులు తమ సొంత రాష్ట్రాలకు కాకుండా వేర్వేరు రాష్ట్రాల్లో ఉండిపోయారు. 
 
ఏపీలో రిటైర్మెంట్‌ వయోపరిమితి 60 ఏళ్లు, తెలంగాణలో 58 ఏళ్లుగా ఉన్న విషయం తెలిసిందే. ప్రభుత్వం తమను ఏపీకి కేటాయించే ఉత్తర్వులు ఇవ్వడంలో జాప్యం వల్ల తాము నష్టపోతున్నామని ఏపీ స్థానికత ఉండి... తెలంగాణలో పనిచేసి రిటైరైన ఉద్యోగులు గగ్గోలు పెట్టారు. కొంతమంది మాత్రం జాగ్రత్తపడి రిటైర్‌మెంట్‌కు కాస్తముందుగా ఏపీ ప్రభుత్వానికి రిపోర్టు చేసి మరో రెండేళ్ల అదనపు సర్వీసు పొందారు. రిలీవింగ్‌ ఆర్డర్‌ రాక తెలంగాణలో మిగిలిపోయి రిటైరైన వాళ్లు రెండేళ్లు నష్టపోయారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వీరి విషయంలో సుదీర్ఘ ఆలోచనలు చేసింది. 
 
ఆంధ్రప్రదేశ్‌ స్థానికత ఉండి... తెలంగాణలో పనిచేస్తూ ఆపై ఆంధ్రాకు నియమితులైన వారిలో ఇప్పటికే ఉద్యోగ విరమణ చేసినవారందరూ తిరిగి ఎలాంటి సర్వీసు బ్రేక్‌ లేకుండా ఉద్యోగాల్లో చేరవచ్చని పేర్కొంటూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, వారికి 60 ఏళ్లు నిండి ఉండకూడదని జీవోలో పేర్కొన్నారు. ఇలాంటి ఉద్యోగుల సంఖ్య వందల్లోనే ఉంటుందని, అందువల్ల ఈ వెసులుబాటు కల్పించామని అధికార వర్గాలు తెలిపాయి. అంటే... గతేడాది జూన్‌ తర్వాత రిటైరై ప్రస్తుతం ఖాళీగా ఉన్నవారు తిరిగి వారి మాతృశాఖకు రిపోర్ట్‌ చేయాలి. వారి కేటగిరీలో ఖాళీగా ఉన్న పోస్టుల్లో వీరిని నియమిస్తారు.