శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 29 జులై 2014 (10:26 IST)

తెలంగాణలో సూపర్ స్పెషాలిటీ: ఏపీకి 3 మెగా ఐటీ హబ్‌లు!

తెలంగాణ రాష్ట్రంలో ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) తరహా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నెలకొల్పేందుకు కేంద్రం సంసిద్ధత వ్యక్తం చేసింది. ఒకేచోట 200 ఎకరాల స్థలం ఉండేలా మూడు నాలుగు ప్రాంతాలను ఎంపిక చేసి ప్రతిపాదనలు పంపించాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. 
 
ఎయిమ్స్ తరహా ఆసుపత్రి నెలకొల్పేందుకు స్థలం చూడాలని తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రమంత్రి హర్షవర్ధన్ సూచించారు. ఆంధ్రప్రదేశ్ సహా పదకొండు రాష్ట్రాల్లో ఎయిమ్స్ తరహా ఆసుపత్రులను ఏర్పాటు చేయాలని ఇటీవల కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే.
 
ఆ జాబితాలో తెలంగాణ రాష్ట్రం లేకపోవడంతో కేసీఆర్ కేంద్రానికి లేఖ రాశారు. స్పందించిన కేంద్రమంత్రి హర్షవర్ధన్.. తెలంగాణలోను ఎయిమ్స్ తరహా బోధనాసుపత్రిని ఏర్పాటు చేస్తామన్నారు. 
 
మరోవైపు ఏపీకి మూడు మెగా ఐటీ హబ్‌లు ఏర్పాటు కానున్నాయి. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలలో దాదాపు రెండువేల ఎకరాల్లో గ్రీన్ ఫీల్డ్ మెగా ఐటీ హబ్‌లను ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని నిర్ణయించింది. ఇందులో రూ.500 కోట్లు ఈ-సేవలు అందించేందుకు వీలుగా పదివేల గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తారు. వెయ్యి కోట్ల రూపాయల్లో రెండువందల కోట్లు కేంద్రం నుండి వచ్చే అవకాశముంది.