బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By dv
Last Updated : గురువారం, 11 ఆగస్టు 2016 (16:15 IST)

వంద ఎకరాల్లో ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌: టీఎస్ మంత్రి తలసాని శ్రీనివాస్

రాష్ట్రంలో సినిమా రంగాన్ని అభివృద్ధి చేసేందుకుగాను వంద ఎకరాల్లో ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌ నిర్మిస్తామని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ తెలిపారు. సినిమా షూటింగ్‌ అనుమతుల

రాష్ట్రంలో సినిమా రంగాన్ని అభివృద్ధి చేసేందుకుగాను వంద ఎకరాల్లో ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌ నిర్మిస్తామని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ తెలిపారు. సినిమా షూటింగ్‌ అనుమతులకు సింగిల్‌విండో విధానాన్ని చేపడతామన్నారు. మంగళవారం ఆయన చలనచిత్ర అభివృద్ధి శాఖ అధికారులతో సచివాలయంలో సమావేశమయ్యారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ సినిమారంగ అభివృద్ధిని, ఆ రంగంపై ఆధారపడిన వారిని ప్రోత్సహించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారన్నారు. 
 
ఈ మేరకు వీలైనంత త్వరగా నిర్ణయాలు అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. వంద ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌లో చిత్రరంగంలో రాణించాలనుకునే వారికి శిక్షణ ఇప్పించడంతోపాటు వసతి సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తామన్నారు. సినిమా షూటింగ్‌లకు అవసరమైన అనుమతులను తెలంగాణ ఫిల్మ్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్ (ఎఫ్‌డీసీ) ద్వారా ఇచ్చేందుకు సింగిల్‌ విండో విధానాన్ని రూపొందిస్తున్నామని, తక్కువ బడ్జెట్‌ చిత్రాలను ప్రోత్సహించేందుకు ప్రతి రోజూ 5వ షోను ప్రదర్శించేందుకు ఈ నెలాఖరులోగా అనుమతులు మంజూరు చేస్తామని తెలిపారు. 
 
టికెటింగ్‌ విషయంలో వీలైనంత త్వరలో ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటిస్తామని, వాణిజ్య ప్రాంతాలు, బస్‌డిపోలు, ప్రభుత్వ భవనాల సముదాయాల్లో 200 సీటింగ్‌ కెపాసిటీతో మినీ థియేటర్లను ప్రోత్సహిస్తామని తలసాని అన్నారు. నంది అవార్డుల పేరు మార్పునకు సంబంధించిన అంశంపై ప్రభుత్వ సలహాదారు కేవీ.రమణాచారి నేతృత్వంలోని కమిటీ మరోమారు సమావేశమవుతుందని, చిత్రపురి కాలనీలో 4300 మంది సినీ కార్మికులకు ఇళ్లు నిర్మించి ఇస్తామని వివరించారు.