బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 30 మే 2016 (10:21 IST)

చావనైనా చస్తాం.. ఏపీలో పనిచేయం... నేటి నుంచి విద్యుత్ ఉద్యోగుల ఆమరణ దీక్ష

చావనైనా చస్తాం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పని చేసే ప్రసక్తే లేదని తెలంగాణ ఉద్యోగులు హెచ్చరించారు. ఏపీ విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను రిలీవ్ చేయాలని డిమాండ్ చేస్తూ గత 20 రోజులుగా చేస్తున్న రిలే నిరాహార దీక్షలు తీవ్రరూపం దాల్చాయి. ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించినా ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ పట్టించుకోకపోవడంతో సోమవారం నుంచి అమరణ నిరాహార దీక్షలకు దిగుతున్నారు. ఈ ఆమరణ నిరాహారదీక్షలను ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులు సిద్ధమవుతున్నారు. 
 
ఏపీ విద్యుత్ సంస్థల్లో మూడు వందల పైచిలుకు మంది తెలంగాణ ఉద్యోగులు పనిచేస్తున్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఏడాది కాలానికి అక్కడ పనిచేయడానికి వెళ్లిన ఉద్యోగులను ఏపీ విద్యుత్ అధికారులు రిలీవ్ చేయడంలేదు. దీంతో కొంతకాలంగా వారు ఆందోళన చేస్తున్నారు. శనివారం కొంత మంది ఉద్యోగులు ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ విజయానంద్ వద్దకు వెళ్లి తమను వెంటనే రిలీవ్ చేయాలని పట్టుబట్టారు. దాంతో ఆయన తనకు సోమవారం వరకు సమయం ఇవ్వాలని కోరారు. సోమవారం ఉదయం 10.30 గంటల వరకు రిలీవ్ చేసే అవకాశం లేనందున నిరాహార దీక్షకు సిద్ధమమవుతున్నారు.