శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Updated : శనివారం, 4 జులై 2015 (11:59 IST)

ఎక్కించుకోం...! ఏంటట..? సరిహద్దుల్లో ఎర్రబస్సు గొడవ...!! కొత్త సమస్య..

తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఆర్టీసి సర్వీసుల్లో ఏపీ విద్యార్థుల పాస్‌లను అనుమతించడం లేదు. ఏపీఎస్‌ఆర్టీసీ తగినంత రుసుం వసూలు చేసి పాస్‌లు జారీ చేసింది. ఇది తెలుగు రాష్ట్రాల మధ్యన కొత్త సమస్యగా రూపుదిద్దుకుంటోంది. వివరాలిలా ఉన్నాయి. 
 
తూర్పు గోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన విద్యా ర్థులు సుదీర్ఘ కాలంగా ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, అశ్వారావుపేట విద్యా సంస్థల్లో చదువుకుంటున్నారు. ఇప్పుడు ఆర్టీసీ విభజన తరువాత తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో ఏపీ విద్యార్థుల పాస్‌లను నిలిపివేశారు. 
 
సత్తుపల్లి-చింతలపూడి మధ్య ప్రయాణించే బస్సులన్నింటిల్లోనూ విద్యార్థులు ఎక్కడానికి వీలులేదని ఆంక్ష పెట్టారు. గడిచిన నెలంతా పాఠశాలలు తెరిచిన దగ్గర నుంచి ఈ వివాదం కొనసాగుతూనే ఉంది. ఇంకోవైపు జీలుగుమిల్లి గ్రామం-అశ్వారావుపేట (ఖమ్మం జిల్లా) మధ్య ఇంతకుముందు రాకపోకలు సులువుగా ఉండేవి. 
 
జీలుగుమిల్లి నుంచి కేవలం ఒకటిన్నర కిలోమీటర్ల కూతవేటు దూరంలో ఉన్న అశ్వారావుపేటకు కూడా విద్యార్థులను అనుమతించడంలేదు. రాఘవాపురం నుంచి సత్తుపల్లి వెళ్ళాల్సిన విద్యార్థులంతా ఇప్పుడు ఎటూ తేల్చుకోలేక వీధులకెక్కారు. మూడు రోజులుగా సుదీర్ఘ ఆందోళన నిర్వహిస్తున్నారు. 
 
తమ భవిష్యత్తుతో ఆర్టీసీ ఆడుకోరాదన్నదే వీరి డిమాండ్‌. కాని టీ ఆర్టీసీ మాత్రం వీటిని బేఖాతర్‌ చేసింది. మా నిబంధనలు మాకు ఉన్నాయి, రాఘవాపురం దాటిన తరువాత వెంటనే తెలంగాణ రాష్ట్ర సరిహద్దు వస్తుంది కాబట్టి ఈ ప్రాంతానికి చెందిన విద్యార్థుల పాస్‌లు చెల్లవన్నదే వారి వాదన. 
 
ఇదిలా ఉంటే స్థానిక నేతలు రంగంలోకి దిగారు. తమ పట్ల అనుచితంగా వ్యవహరిస్తున్న టీ ఆర్టీసీ ఈ ప్రాంతానికి సర్వీసులు నడపక్కర్లేదని రెండు రోజుల క్రితమే సత్తుపల్లి డిపో బస్సులను వెనక్కి తిప్పి పంపారు. దీంతో పశ్చిమ-ఖమ్మం జిల్లాల సరిహద్దుల్లో ఎర్రబస్సు వివాదం మరింత ముదిరు పాకాన పడుతోంది. ప్రభుత్వాలు కలుగజేసుకోకపోతే.. కొత్త సమస్యే...