శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 20 సెప్టెంబరు 2014 (13:51 IST)

తెలంగాణకు స్పెషల్ స్టేటస్ ఇవ్వండి: కేసీఆర్ విజ్ఞప్తి

తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 14వ ఆర్థిక సంఘానికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఒక్క హైదరాబాద్ మినహా మిగిలిన అన్ని జిల్లాలు బాగా వెనుకబడివున్నాయని, అందువల్ల తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. 
 
హైదరాబాద్‌లోని కాకతీయ హోటల్లో జరుగుతున్న 14వ ఆర్థిక సంఘం సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్, ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. తెలంగాణలో చాలా జిల్లాలు వెనుకబడి ఉన్నాయని, ముఖ్యంగా మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాలు చాలా వెనుకబడి ఉన్నాయన్నారు. 
 
అందువల్ల తెలంగాణకు ప్రత్యేక రాష్ట్రం హోదా ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అయితే రాష్ట్ర ఆదాయంలో హైదరాబాద్ అగ్రస్థానంలో ఉందని కేసీఆర్ ఈ సందర్భంగా 14వ ఆర్థిక సంఘానికి చెప్పారు. తెలంగాణలో తమ ప్రభుత్వం అమలు చేయాలనుకుంటున్న పథకాల వివరాలను కేసీఆర్ ఈ సందర్భంగా వివరించారు.  
 
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ వివక్షకు గురైందని, చాలా జిల్లాలు వెనుకబడి ఉన్నాయని వివరించారు. రాష్ట్ర ఆదాయంలో హైదరాబాద్‌ అగ్రభాగాన ఉందని, వచ్చే ఐదేళ్లలో అభివృద్ధిని వేగవంతం చేస్తామన్నారు. పేదరిక నిర్మూలనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. పారిశ్రామిక అభివృద్ధికి ఖాళీ భూములను గుర్తించామన్నారు. దళితులకు 3 ఎకరాల భూపంపిణీని మొదలుపెట్టినట్లు కేసీఆర్‌ వివరించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.  
 
తెలంగాణలో హరితహారం పథకానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తామని, రాష్ట్రానికి వచ్చే నిధుల కోసం కేంద్రానికి ప్రతిపాదించాలని ఆర్థిక సంఘాన్ని కోరారు. ప్రతి నియోజకవర్గంలో 30 లక్షలు మొక్కలు నాటుతామని వెల్లడించారు. పారిశ్రామికాభివృద్ధికి విద్యుత్‌ లోటు అడ్డంకిగా మారిందని, విద్యుత్‌ కోతలు అధిగమించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. సమగ్ర సర్వే వల్ల అర్హులకు సంక్షేమ పథకాలు చేరుతాయని ఆర్థిక సంఘం ప్రతినిధులకు సీఎం కేసీఆర్‌ వివరించారు.