శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 22 ఆగస్టు 2014 (12:34 IST)

తెలంగాణపై అమిత్ షా: 2019లో తెలంగాణలో కమలం జెండా

తెలంగాణ కోసం మొదటిసారిగా తీర్మానం చేసింది బీజేపీయేనని ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా గురువారం సికింద్రాబాదులోని ఇంపీరియల్ గార్డెన్స్ లో మాట్లాడుతూ అన్నారు. గ్రేటర్ హైదరాబాదు పార్టీ నేతలతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. అమిత్ ను పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ బిల్లుకు భాజాపా మద్దతుతోపాటు తెలంగాణ ఏర్పాటుకు తొలి నిర్ణయం తీసుకున్నది బీజేపీయేనని తెలిపారు.
 
ఇంకా ఆయన మాట్లాడుతూ... హైదరాబాదు సంస్థానాన్ని సర్దార్ వల్లభాయ్ పటేల్ నిజాం కబంధ హస్తాల నుంచి విముక్తి చేసి భారత్ యూనియన్ లో విలీనం చేశారని గుర్తు చేశారు. సెప్టెంబరు 17వ తేదీన ‘తెలంగాణ వికాస దినం’గా నిర్వహిస్తామని చెప్పారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందనీ, 2019లో కేంద్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి రావాలంటే దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ సత్తా చాటాలని అమిత్ షా నాయకులతో అన్నారు.
 
2019లో తెలంగాణలో కమలం జెండా ఎగరాలని అమిత్ షా అన్నారు. గుజరాత్‌ రాష్ట్రాన్ని బీజేపీకి పెట్టని కోటగా నిర్మించి... మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌ను బీజేపీని తిరుగులేని శక్తిలా మార్చిన అమిత్‌షా... తన తదుపరి గురి తెలంగాణపై పెట్టారు. 
 
పార్టీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం గురువారం తొలిసారిగా ఆయన తెలంగాణపై అడుగు పెట్టారు. బీజేపీని గడపగడపకూ తీసుకెళ్లాలని పిలుపునిస్తూనే... టీఆర్‌ఎస్‌ సర్కారు చేసే తప్పులపై  ‘ప్రతిపక్షం’లాగా పోరాడాలని ఆదేశించారు.