గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Updated : శనివారం, 23 మే 2015 (06:08 IST)

గతం గుర్తు చేయండి... వర్తమానం వివరించండి.. పార్టీ నాయకులకు బాబు హితవు

విభజన కారణంగా నష్టపోతామని అప్పట్లో జరిగిన ఆందోళనలను, ఆ ఫోటోలను వీడియోలను ప్రదర్శిస్తూ జనానికి గుర్తు చేయండి.. ప్రస్తుతం ఏం చేయలేకపోతున్నామో వివరిస్తూ నవ నిర్మాణ దీక్షను నిర్వహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ శ్రేణులకు, మంత్రులకు పిలుపునిచ్చారు. జూన్ 2న నవనిర్మాణ దీక్షను చేపట్టాలని ఆదేశించారు. 
 
విభజన కారణంగా ఏపీకి జరిగిన నష్టం వివరిస్తూ ఆ సమయంలో అయిన గాయాలు, పోరాటాలు, ఆందోళనలతో చిత్రీకరించిన వీడియోలను ప్రజల్లో విస్తృతంగా ప్రదర్శించాలని ఆదేశించారు. విభజన అంశాలు ప్రజలు మరిచిపోకుండా వారిలో భావోద్వేగాలను సజీవంగా ఉంచేలా వీడియో చిత్రాలు, బుక్‌లెట్లు, కరపత్రాలు వంటి అన్ని రకాలుగా ప్రజల్లో పంపిణీ చేయాలని చెప్పారు. ఎగ్జిక్యూటివ్‌లుగా తాము ఆ పని చేయవచ్చా? అని కొందరు సందేహం వ్యక్తం చేయగా... ఖచ్చితంగా చేయాల్సింది మీరేనని నొక్కి చెప్పారు. 
 
జూన్ రెండో తేదీన నవ నిర్మాణ దీక్ష నిర్వహించి ప్రజల్లో కసి, స్ఫూర్తి రగిలించి ఉత్తమ ఫలితాలు సాధించాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఇది కేవలం ప్రభుత్వ కార్యక్రమం కాదని, 13 జిల్లాల ప్రజల కార్యక్రమమని తెలిపారు. ఇది ఉత్సవం కాదని, అన్యాయంగా విభజన చేసిన వారు సైతం అసూయపడేలా రాష్ట్ర అభివృద్ధికి పునరంకితం అయ్యేందుకే ఈ దీక్ష చేపడుతున్నట్లు చెప్పారు. ఆరోతరగతి ఆపై చదివే విద్యార్థులందరినీ ఇందులో భాగస్వాములను చేయాలన్నారు. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ అనుసరించిన నియంతృత్వ వైఖరికి నిరసనగానే 125 ఏళ్ల చరిత్ర ఉన్న ఆ పార్టీని ప్రజలు చిత్తుగా ఓడించారని వ్యాఖ్యానించారు.