బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Updated : గురువారం, 13 ఏప్రియల్ 2017 (18:59 IST)

కొలిక్కి వచ్చిన తెలుగు రాష్ట్రాల కార్మిక సమస్య.. నిధుల్ని 58+42 నిష్పత్తిలో పంచుకుంటాం: పితాని

సచివాలయం, ఏప్రిల్ 13: ఆంధ్ర, తెలంగాణ ఇరు రాష్ట్రాల మధ్య మూడేళ్లుగా అపరిష్కృతంగా ఉన్న భవన నిర్మాణ కార్మికులు, ఇతర నిర్మాణాల కార్మికుల సంక్షేమ బోర్డు నిధుల సమస్య పరిష్కారమైనట్లు ఉపాధి, కార్మిక శాఖ మంత్ర

సచివాలయం, ఏప్రిల్ 13: ఆంధ్ర, తెలంగాణ ఇరు రాష్ట్రాల మధ్య మూడేళ్లుగా అపరిష్కృతంగా ఉన్న భవన నిర్మాణ కార్మికులు, ఇతర నిర్మాణాల కార్మికుల సంక్షేమ బోర్డు నిధుల సమస్య పరిష్కారమైనట్లు ఉపాధి, కార్మిక శాఖ మంత్రి పితాని సత్యనారాయణ చెప్పారు. సచివాలయం 4బ్లాక్ లోని పబ్లిసిటీ సెల్‌లో గురువారం మధ్యాహ్నం ఆయన మాట్లాడారు.

రాష్ట్రం విడిపోయిన తరువాత ఇంత కాలం అపరిష్కృతంగా ఉన్న ఈ సమస్య సామరస్యంగా పరిష్కారమవడం శుభపరిణామం అన్నారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కె.చంద్రశేఖర రావుల అంగీకారం మేరకు తెలంగాణ కార్మిక శాఖ మంత్రి నాయని నరసింహా రెడ్డితో తాను మాట్లాడినట్లు చెప్పారు. అలాగే ఇరు రాష్ట్రాల అధికారులు కూడా మాట్లాడి ఒక అంగీకారానికి వచ్చినట్లు తెలిపారు. 
 
మన రాష్ట్ర అధికారులపై పెట్టిన కేసులు కూడా ఎత్తివేయడానికి అంగీకారం కుదిరినట్లు చెప్పారు. ఏపీ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని, చర్చలు జరపడం ద్వారా ఈ సమస్య పరిష్కారమైనట్లు తెలిపారు. సంక్షేమ బోర్డుకు సంబంధించిన నిధులు ఇరు రాష్ట్రాల జనాభా ప్రాతిపదికన 58+42 నిష్పత్తిలో పంచుకోవడానికి ఇరు ప్రభుత్వాలు అంగీకరించాయి. 2014 జూన్ 1వ తేదీ నాటికి మొత్తం నిధులు రూ.1463 కోట్ల 44 లక్షలు ఉన్నట్లు తెలిపారు. ఇందులో రూ.458 కోట్ల 52 లక్షలు ఇరు రాష్ట్రాల పీడీ ఖాతాలలో జమ అయ్యాయి.
 
ఏపీ ఖాతాలో రూ.267 కోట్ల 41 లక్షలు, తెలంగాణ ఖాతాలో రూ. 191 కోట్ల 11 లక్షలు జమ అయ్యాయి. మిగిలిని రూ. 1105 కోట్ల 56 లక్షలలో ఏపీకి రూ. 639 కోట్ల 91 లక్షలు, తెలంగాణకి రూ. 465 కోట్ల 64 లక్షలు జమ కావలసి ఉంది. రాష్ట్రంలోని పెద్దలు ఎవరినీ సంప్రదించకుండా చీకటి ఒప్పందం ద్వారా పాస్ చేసిన రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు వల్ల అనేక సమస్యలు తలెత్తాయన్నారు. వాటిని కూడా ఇదేవిధంగా పరిష్కరించుకుంటామని చెప్పారు. 
 
ఉద్యోగులు, టూరిజం, పోలీస్ కేసులు వంటి సమస్యలన్నిటినీ పరిష్కరించుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ముందుకు రావాలని కోరుకుంటున్నామన్నారు. ఏపీ ప్రభుత్వ పక్షాన తాము సిద్ధంగా ఉన్నట్లు మంత్రి పితాని చెప్పారు.