శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : బుధవారం, 27 ఆగస్టు 2014 (18:20 IST)

తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తులు రూ.9800 కోట్లు!

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానానికి (తితిదే) భారత్‌, నేపాల్‌లో కలుపుకుని రూ.9800 కోట్ల ఆస్తులు ఉన్నాయి. వీటిలో ఆలయ భూములతోపాటు.. షాపింగ్ మాల్స్‌, భవనాలు ఉన్నాయి. ఈ ఆస్తులన్నీ ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, కేరళ, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర, పుదుచ్చేరి, హర్యానా, ఒడిషా రాష్ట్రాలతో పాటు.. పొరుగు దేశమైన నేపాల్‌లో ఉన్నాయి. ఈ విషయాన్ని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖామంత్రి మాణిక్యాల రావు అసెంబ్లీలో వెల్లడించారు. 
 
ప్రస్తుత మార్కెట్ ప్రకారం వీటి విలువ రూ.9800 కోట్లుగా ఉంటుందని అంచనా వేసినట్టు తెలిపారు. సంయుక్తాంధ్ర ప్రదేశ్‌లో తితిదేకు 4657.51 ఎకరాల భూములు ఉండగా, నేపాల్‌తో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో 125.75 ఎకరాల భూములు ఉన్నట్టు వివరించారు. ఈ ఆస్తులను కాపాడేందుకు ప్రత్యేక న్యాయ విభాగం, ఆస్తుల విభాగం పని చేస్తుందన్నారు. అలాగే, తితిదేలో 16 వేల మంది ఉద్యోగులతో పాటు ముగ్గురు ఐఏఎస్ అధికారులు, ఒక ఐపీఎస్ అధికారి విధులు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. 
 
ప్రస్తుతం మార్పులు చేర్పులు చేసిన ధరల మేరకు తితిదే ఆదాయం మరింతగా పెరగనుందని చెప్పారు. అందువల్ల మరో ఇద్దరు ఐఏఎస్ అధికారులను కొండపై విధులు నిర్వహించేందుకు త్వరలోనే నియమించనున్నట్టు తెలిపారు. అంతేకాకుండా, ఒక్క తిరుపతిలోనే 163 ఎకరాల తితిదే స్థలం అన్యాక్రాంతమైందని, దీన్ని చట్టపరంగా తిరిగి స్వాధీనం చేసుకునేందుకు తితిదే చర్యలు చేపట్టిందన్నారు. మరో 150 ఎకరాల స్థాలాన్ని మహిళా విశ్వవిద్యాలయానికి ఇచ్చినట్టు తెలిపారు.