శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR

వచ్చే నెలలో కోదండరాం రిటైర్మెంట్.. యాక్టివ్ పొలిటీషియన్‌గా మారుతారా?

తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ప్రభుత్వ ఉద్యోగం నుంచి వచ్చే నెలలో పదవీ విరమణ చేయనున్నారు. ఆ తర్వాత ఆయన క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. 
 
తెలంగాణ ఉద్యమ సమయంలో కోదండరాం అత్యంత కీలక పాత్ర పోషించారు. ఆయన టీజేఏసీకి సారథిగా తన విధులను సమర్ధవంతంగా నిర్వర్తించారు. ముఖ్యంగా ఉద్యోగ సంఘాలను, రాజకీయ పార్టీలను ఒకే వేదిక మీదకు తీసుకొచ్చి ముందుకు నడిపించిన ఘనత ఆయనదే. ఒక విధంగా చెప్పాలంటే ఉద్యమానికి ఓ ఊపునిచ్చారు. 
 
జేఏసీ చేపట్టిన ప్రతికార్యక్రమంలో కోదండరాంది కీలక పాత్ర. కానీ ప్రత్యేక రాష్ట్రం సాకారమవడంతో కోదండరాం దూకుడు తగ్గింది. జేఏసీలో కీలకంగా ఉన్న ఉద్యోగ సంఘాల నేతలకు అదృష్టం వరించింది. స్వామిగౌడ్‌కు ఎమ్మెల్సీ పదవితో పాటు మండలి చైర్మన్‌ పీఠాన్ని... మరో నేత శ్రీనివాస్‌ గౌడ్‌ మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యేగా గెలిచారు. మరో నేత విఠల్‌కు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సభ్యుడిగా అవకాశమిచ్చారు. కానీ, కోదండరాం మాత్రం కేసీఆర్‌కు దూరమయ్యారు. 
 
గత యేడాది కాలంగా ఆయన తెరాస ప్రభుత్వానికి, తెరాస కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో ఆయన ప్రొఫెసర్‌గా తిరిగి విధుల్లో చేరారు. అపుడప్పుడూ టీ జేఏసీ స్టీరింగ్‌ కమిటీ  సమావేశాలు నిర్వహిస్తూ.. కీలక అంశాలపై తన అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. విభజన చట్టం, అమరవీరుల జాబితా, సచివాలయం తరలింపు వంటి అంశాలపై ఆయన పలుమార్లు మాట్లాడారు. 
 
ఈ నేపథ్యంలో ప్రొఫెసర్ ఉద్యోగం నుంచి ఆయన వచ్చే నెలలో రిటైర్మెంట్ కానున్నారు. దీంతో ఆయన భవిష్యత్‌పై పలు రకాలైన ఊహాగానాలు వస్తున్నాయి. కోదండరాం ఉద్యమ నాయకుడిగానే ఉండాలనీ, బంగారు తెలంగాణ కోసం ప్రజాసంఘాలతో కలిసి ఉద్యమ పంథాను కొనసాగించాలని భావిస్తున్నట్టు సమాచారం. 
 
అదేసమయంలో అన్ని రాజకీయ పార్టీలతో సన్నిహితంగా ఉంటూ.. తన పట్టును పెంచుకోవాలన్న భావనలో ఉన్నారు. అందుకే తిరిగి ప్రజా సంఘాలతో కలిసి పనిచేయాలన్న అభిప్రాయంలో ఆయన ఉన్నారని సమాచారం. సెప్టెంబర్‌ తర్వాత కోదండరాంని మరోసారి ఉద్యమ నేతగా చూడబోతారన్న చర్చ ఆయన సన్నిహితుల్లో జరుగుతోంది.