శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Updated : శుక్రవారం, 27 మార్చి 2015 (22:11 IST)

ఇదో చారిత్రాత్మక ఘట్టం... ఒకే రోజు మూడు ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు : మంత్రి గంటాతో ఇంటర్వ్యూ

రాష్ట్రంలో విద్యావకాశాలను, విద్యా ప్రమాణాలను పెంపొందించడానికి తమ ప్రభుత్వం పెద్ద ఎత్తున కృషి చేస్తోందని రాష్ట్ర విద్యా శాఖా మంత్రి గంటా శ్రీనివాస రావు తెలిపారు. ఒకే రోజున మూడు ప్రతిష్టాత్మక సంస్థలను తాము నెలకొల్పుతున్నామనీ, వర్శిటీలు, కళాశాలల ఆర్ధిక పరిపుష్టిని పెంచి మరింత సమర్ధవంతంగా పనిచేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. శుక్రవారం సాయంత్రం తిరుపతి తుడా కార్యాలయంలో గంటా శ్రీనివాస రావుతో వెబ్ దునియా ముఖాముఖి. 
 
వెబ్ దునియా: గుడ్ ఈవెనింగ్ సార్.. రాష్ట్ర విభజన తరువాత ప్రభుత్వం ఏర్పాటై 9 నెలలు కావస్తోంది. విద్యాపరంగా ఎటువంటి అభివృద్ధి ఉంది?
గంటా శ్రీనివాస రావు : విద్య కోసం మా ప్రభుత్వం చాలా కృషి చేస్తోంది. ఎక్కడ విద్య ఉంటుందో అక్కడ అభివృద్ధి జరుగుతుందని నమ్మేవాళ్లం. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడైనా మూడు ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు వచ్చాయా...ఐఐటి, ఐఐఎస్ఇఆర్, ట్రిపుల్ ఐటి మూడు విద్యాసంస్థలకు శంఖుస్థాపన చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, స్మృతి ఇరానీ, సుజనా చౌదరీ వస్తున్నారు. 
 
వె.దు. : రాష్ట్రాన్ని ఓ నాలెడ్జ్ సెంటర్‌గా మార్చుతామని ముఖ్యమంత్రి చెబుతున్నారు. మరి చర్యలు ఎంతవరకు వచ్చాయి?
మంత్రి : ఖచ్చితంగా మార్చుతాం. మా హయాంలో కాకపోతే మరెవరి హయాంలో జరుగుతుంది చెప్పండి. అందుకే కేంద్రంతో సమన్వయం చేసుకుని రాష్ట్రంలో అనేక జాతీయ సంస్థలను నెలకొల్పడానికి చర్యలు తీసుకుంటున్నాం. ఈ మూడు సంస్థలే కాదు. పెట్రోలియం యూనివర్శిటీ వస్తోంది. సముద్రజలాలపై అధ్యయన కేంద్రం వస్తోంది. ఒకచోట అని కాదు. ఉత్తరాంధ్రలో గిరిజన యూనివర్శిటీ ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
 
వె.దు. : తిరుపతిలోనే మూడు జాతీయ స్థాయి సంస్థలు?
మంత్రి : తిరుపతిని ఎడ్యుకేషనల్ హబ్‌గా మార్చుతామని చెప్పాం. అందులో భాగంగానే తిరుపతికి ప్రాధాన్యత లభిస్తోంది. ఆ మూడు సంస్థలు తిరుపతి పరిసర ప్రాంతాలలోనే నెలకొల్పుతున్నాం. అంతేకాదు, మెడికల్ కాలేజీలు కూడా ఈ ప్రాంతంలో మరిన్ని స్థాపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. 
 
వె.దు. : మరి విశ్వవిద్యాలయాల సంగతేంటి..? నిధులు కొరతతో విలవిలలాడుతున్నాయని చెబుతున్నారు?
మంత్రి : అలాంటిదేమీ లేదు. రాష్ట్రంలో ఎస్వీ, ఆంధ్ర, నాగార్జున, కృష్ణదేవరాయ వర్శిటీలకు ఒక్కోక్కదానికి రూ. 20 కోట్ల చొప్పున ఇస్తున్నాం. శ్రీకాకుళం, రంపచౌడవరంలోని రెండు కళాశాలలను మోడల్ కళాశాలలుగా మార్చడానికి కనీసం రూ. 12 కోట్ల నిధులను కేటాయించాం. రాజమండ్రిలోని ఆర్ట్సు కళాశాలను కన్వర్ట్ చేయడానికి రూ. 55 కోట్లు కేటాయిస్తున్నాం. ఇంకా చాలా డిగ్రీ కాలేజీలకు నిధులు కేటాయిస్తున్నాం. 
 
వె.దు. : వర్శిటీలలో నియామకాల జరుగకుండా ఎందుకు ఆపుతున్నారు?
మంత్రి: వర్శిటీలలో నియామకాలను ఆపమని కానీ, ఆపాలని కానీ మాకు ఆలోచన లేదు. కొందరు విసీలు త్వరలో రిటైర్డు కాబోతున్నారు. పైగా ఈ మధ్య కాలంలో ఒకటి, రెండు వర్శిటీల నియామకాలపై ఆరోపణలు వచ్చాయి. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఏపిపిఎస్సీలా ఒక మండలిని ఏర్పాటు చేసి దాని ద్వారా నియామకాలు చేపడితే బాగుంటుందని భావిస్తున్నాం. అందుకోసం నిపుణుల కమిటినీ ఏర్పాటు చేసి నియమనిబంధనలు రూపొందించబోతున్నాం. దీని ద్వారా నియామకాలు చేపడితే పారదర్శకత ఉంటుందని భావిస్తున్నాం. 
 
వె. దు. : ఫైనల్ గా చెప్పండి విద్యాపరంగా మీ లక్ష్యాలేమిటి?
మంత్రి: మా లక్ష్యం ఒకటే. మెరుగైన విద్యను అందించడం. రాష్ట్రాన్ని నాలెడ్జ్ సెంటర్‌గా మార్చడం. రాష్ట్ర విద్యా శాఖకు 19 వేల కోట్లు కేటాయించారు. అవసరమనుకుంటే మరిన్ని నిధులు ఇవ్వడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిద్ధంగా ఉన్నారు.
 
వె. దు. : ఓకే.. గుడ్ లక్.. సార్ 
మంత్రి: థాంక్యూ...