శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By CVR
Last Updated : శనివారం, 18 జులై 2015 (13:15 IST)

ట్రాఫిక్ రద్దీలో గో'దారులు'... కిలోమీటర్ల మేర బారులుతీరిన వాహనాలు..

వరుసగా సెలవులు రావడంతో గోదావరి పుష్కరాలకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. దీంతో గోదావరి వైపుగా వెళ్లే రోడ్లన్నీ వాహనాలతో కిటకిటలాడుతున్నాయి. ఉభయగోదావరి జిల్లాలలో పుష్కరాలకు వెళ్లే వాహనాలతో ట్రాఫిక్ స్తంభించింది. చెన్నై- కోల్‌కతా జాతీయ రహదారిపై ట్రాఫిక్ రద్దీకారణంగా వాహనాలు నత్తనడక నడుస్తున్నాయి. 
 
విశాఖ జిల్లా నక్కపల్లి, కాగిత టోల్ గేట్ ప్రాంతాల్లో దాదాపు రెండు కిలోమీటర్ల మేర కార్లు, బస్సులు ఇతర వాహనాలు బారులుతీరాయి. నక్కపల్లి అడ్డరోడ్డు వద్ద ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు పోలీసులు చర్యలు చేపడుతున్నారు. మరోవైపు విజయవాడ- రాజమండ్రి జాతీయ రహదారిపై కూడా వందలాది వాహనాలు నిలిచిపోయాయి. గన్నవరం, హనుమాన్ జంక్షన్ వద్ద ట్రాఫిక్ స్తంభించింది. 
 
అటు తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట వద్ద సుమారు ఆరు కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఇటు పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరు-నల్లజర్ల, కోవ్వూరు-నిడదవోలు మార్గాల్లో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. మరో వైపు బస్సులూ ప్రయాణీకులతో కిక్కిరిసిపోతున్నాయి. ఇక విజయవాడ, విశాఖ రైల్వేస్టేషన్లు పుష్కరయాత్రికులతో నిండిపోయాయి. గంటలకొద్దీ రైళ్లు ఆలస్యంగా నడుస్తుండటంతో భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.