శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 25 జులై 2014 (14:58 IST)

బస్సు - రైలు ఢీ ఎఫెక్ట్ : ఏపీ బడి బస్సులపై ఆర్టీవో కొరఢా!

మెదక్ జిల్లాలో స్కూలు బస్సు నాందేడ్ ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొనడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణాశాఖమంత్రి సిద్ధా రాఘవరావు అప్రమత్తమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కాలేజీ, స్కూల్ బస్సులను తనిఖీ చేసి... శనివారం సాయంత్రంలోగా నివేదిక అందజేయాలని 13 జిల్లాల ఆర్టీవోలను ఆయన ఆదేశించారు. తెలంగాణలో జరిగిన బస్సు - రైలు ప్రమాదం తరహాలో మరో  ప్రమాదం చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టినట్టు ఆయన తెలిపారు. ఇందులోభాగంగానే బడి, కాలేజీ బస్సులను తనిఖీ చేసి నివేదిక సమర్పించాలని ఆదేశించినట్టు ఆయన వివరించారు. 
 
ఇదే అంశంపై ఆయన శుక్రవారం హైదరాబాద్లో మాట్లాడుతూ... రాష్ట్రంలో మారుమూల గ్రామాల్లో రోడ్ల పరిస్థితి బాగోలేదని తెలిపారు. రోడ్ల పరిస్థితిపై కూడా నివేదిక అందజేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. నష్టాలలో ఉన్న అర్టీసీ గట్టెక్కించేందుకు చర్యలు చేపట్టినట్లు వివరించారు. 
 
అందులోభాగంగా అర్టీసీ సంస్థకు సంబంధించిన ఖాళీ స్థలాలు గుర్తించి... వాటిని లీజు ఇవ్వాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. త్వరలో జేఎన్ఎన్యూఆర్ఎమ్ కింద 500 బస్సులు రాష్ట్రానికి రానున్నాయని తెలిపారు. 1000 పల్లె వెలుగు బస్సులు కొనుగోలు చేస్తామని మంత్రి తెలిపారు.