శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Updated : మంగళవారం, 28 ఏప్రియల్ 2015 (09:22 IST)

పిస్తోలు పేలింది... బుల్లెట్టు గ్రెనేడుకు తగులుంటే... ఏమై ఉండేది?

ఓ కానిస్టేబుల్ చేతిలోని ఆయుధంతో సినిమా ఫోజులు పెట్టాడు. గాల్లో తిప్పుతూ రక రకాల భంగిమలు పెట్టి ట్రిగ్గర్ నొక్కాడు బుల్లెట్ దూసుకువచ్చింది. అది కనుకు మరో దిశలో వెళ్లి ఉంటే అమ్మో ఊహించుకోలేం. పోలీసుల ఆయుధాగారం ధ్వంసం అయ్యిండేది. ఈ సంఘటనను పోలీసులు ఎంత మూసిపెట్టాలనుకున్నా కుదురలేదు. ఎప్పుడు..? ఎక్కడ..? ఎలా..? వివరాల్లోకి వెళ్ళితే..
 
విజయవాడలోని బందరు రోడ్డులోని ఆర్మ్‌డ్‌ రిజర్వు మైదానంలో ఆదివారం రాత్రి పిస్టల్‌ పేలుడు ఘటన పోలీసుశాఖలో కలకలం రేపింది. రాత్రి 10:45 సమయంలో ఏఆర్‌ మైదానంలోని బెల్లా ఫామ్స్‌ (ఆయుధాగారం)లో కుమార్‌ అనే కానిస్టేబుల్‌ ఒక వీఐపీకి బందోబస్తు కోసం వెళ్లడానికి సిద్ధమవుతున్నాడు. 9 ఎంఎం పిస్టల్‌లో తూటాల పెట్టె (మ్యాగ్జిన్‌)ను లోడ్‌ చేసి చెక్‌ చేస్తుండగా తుపాకీ పేలింది. ఆ సమయంలో సుమారు నలుగురు సిబ్బంది అక్కడ ఉన్నట్లు తెలిసింది.
 
పిస్టల్‌ లోడ్‌ చేశాక ఒక రౌండ్‌ ఖాళీ ఉంటుంది. దానిని తొలగించడానికి ఒకసారి ట్రిగ్గర్‌ను నొక్కుతారు. అప్పుడు తగు జాగ్రత్తలు పాటించాలి. కానీ ఆ యువ కానిస్టేబుల్‌ అత్యుత్సాహంతో సినిమాలో మాదిరి పిస్టల్‌ను తిప్పుతూ హడావుడి చేశాడని, రౌండ్‌ ఖాళీగా ఉందా లేదా అని చూసుకోకుండా ట్రిగ్గర్‌ నొక్కాడని తెలిసింది.

భారీ శబ్ధంతో తూటా దూసుకురాగా, ఏం జరిగిందా అని అందరూ షాక్‌కు గురయ్యారు. పెద్దసంఖ్యలో ఏకే47, కార్బైన్‌ తుపాకులు, గ్రెనేడ్లు, భాష్పవాయు గోళాలు తదితర ఆయుధ సామగ్రిని నిల్వ ఉంచేచోట ఇది చోటుచేసుకుంది. ఆ తూటా దిశలో దూసుకెళ్ళి ఉంటే ఏ గ్రేనేడ్‌ను కొట్టి ఉంటే భారీ పేలుళ్లే జరిగి ఉండేవి.