బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 21 నవంబరు 2014 (11:35 IST)

రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాల్సిందే: అధికారపక్షం డిమాండ్!

సభను తప్పుదారి పట్టించే విధంగా మాట్లాడిన టిడిపి ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని అధికారపక్షం గురువారం శాసనసభలో పట్టుపట్టింది. రేవంత్‌రెడ్డి వ్యవహారంపైనే టిడిపి సభ్యులు వారంరోజులపాటు సస్పెండ్ అయ్యారు. 
 
గురువారం సభకు వచ్చిన తరువాత అధికారపక్షం రేవంత్‌రెడ్డిని లక్ష్యంగా చేసుకుని మాట్లాడింది. డిఎల్‌ఎఫ్ భూముల వివాదంపై ముఖ్యమంత్రి కెసిఆర్ రేవంత్‌రెడ్డి పేరు ప్రస్తావించకుండానే తీవ్రస్థాయిలో ఆయనపై ధ్వజమెత్తారు. 
 
ఒకవైపు తెలంగాణ రైతులు విద్యుత్ కష్టాలు ఎదుర్కొంటుంటే  ఆంధ్ర ప్రభుత్వం మనకు న్యాయంగా ఇవ్వాల్సిన విద్యుత్ ఇవ్వడం లేదని, టిడిపి ఎమ్మెల్యే ఆంధ్ర ప్రభుత్వానికి మద్దతుగా సభలో మాట్లాడుతున్నాడని కెసిఆర్ రేవంత్‌పై మండిపడ్డారు. 
 
సభలో విద్యుత్‌కు సంబంధించి డాక్యుమెంట్లు పెడతానని చెప్పి పెట్టకుండా సభను తప్పుదోవ పట్టించిన సభ్యుడు క్షమాపణ చెప్పిన తరువాతనే మాట్లాడే అవకాశం ఇవ్వాలని ముఖ్యమంత్రి అన్నారు.
 
అనంతరం రేవంత్‌రెడ్డి మాట్లాడేందుకు లేవగా అధికారపక్షం సభ్యులు క్షమాపణ చెప్పాలని నినాదాలు చేశారు. మంత్రి హరీశ్‌రావు లేచి విద్యుత్‌పై మాట్లాడిన దానికి ఆధారాలు ఉంటే చూపాలి లేదా క్షమాపణ చెప్పాలని, క్షమాపణ చెప్పేంత వరకు మాట్లాడే అవకాశం ఇవ్వవద్దని అన్నారు. ఈ అంశంపై మంత్రి జగదీశ్‌రెడ్డి పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తుతూ రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాకే మాట్లాడాలని అన్నారు.