బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 31 జులై 2015 (14:04 IST)

సెక్షన్-8 అమల్లో ఉండి వుంటే..? కోర్టులోనే తేల్చుకోమన్న కేంద్రం?!

ఆంధ్రప్రదేశ్ స్థానికత ఉన్న విద్యుత్ ఉద్యోగులను తెలంగాణ ప్రభుత్వం విధుల్లోకి తీసుకోవడంపై ఎంపీ రామ్మోహన్ నాయుడు మండిపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కోసమూ తెలంగాణ ప్రభుత్వం ఏపీ విద్యుత్ ఉద్యోగులను తొలగించిందన్నారు. అసలు సెక్షన్ 8 అమలులో ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. కోర్టు ఆదేశాలు టి.ప్రభుత్వం పాటించాలన్నారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తున్న విద్యుత్ ఉద్యోగులకు ఏపీ ఎంపీలు సంఘీభావం ప్రకటించిన సమయంలో ఎంపీ రామ్మోహన్ మాట్లాడారు.
 
తెలుగు రాష్ట్రాల వివాదంగా మారిన విద్యుత్ ఉద్యోగుల పంపిణీ వ్యవహారాన్ని పరిష్కరించడంలో కేంద్రం చేతులెత్తేసింది. శుక్రవారం ఉదయం కేంద్ర హోం శాఖ ఉన్నతాధికారులు నిర్వహించిన సమావేశానికి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఐవైఆర్ కృష్ణారావు, రాజీవ్ శర్మలు హాజరయ్యారు. 
 
ఈ వివాదంపై ఇరు రాష్ట్రాల వాదనలు విన్న హోం శాఖ ఉన్నతాధికారులు, వివాదాన్ని కోర్టు పరిధిలోనే తేల్చుకోండని చెప్పి సమావేశాన్ని ముగించారు. ఏపీ మూలాలు ఉన్నాయన్న వాదనతో తెలంగాణ సర్కారు పెద్ద సంఖ్యలో విద్యుత్ ఉద్యోగులను విధుల్లో నుంచి తప్పించి ఏపీకి బదలాయించింది. అయితే ఒకేసారి అంతపెద్ద సంఖ్యలో ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవడం తమకు సాధ్యం కాదని ఏపీ తేల్చిచెప్పింది. ప్రస్తుతం ఈ వివాదం కోర్టు పరిధిలో ఉంది.