శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: బుధవారం, 20 ఆగస్టు 2014 (21:44 IST)

రూ.300 టికెట్ కొండపై కొనుక్కోలేమా... ఇదేమిటి తిరుమలేశా...?

తిరుమల తిరుపతి దేవస్థానములు కొత్త ప్రయోగాలు చేస్తూనే ఉంటుంది. కొన్ని భక్తులకు మహా ఆనందాన్ని కలుగజేస్తే మరికొన్ని నిర్ణయాలు తీవ్ర అసౌకర్యాన్ని, ఇబ్బందులను కలుగజేస్తాయి. అసలు విషయంలోకి వస్తే... తిరుమలలో సర్వదర్శనం, దివ్యదర్శనంతో పాటు ప్రత్యేక ప్రవేశ దర్శనం సామాన్య భక్తులకు అందుబాటులో ఉందన్న సంగతి మనకు తెలిసిందే.
 
ప్రత్యేక ప్రవేశ దర్శనం... అంటే రూ. 300 టిక్కెట్టు కొనుక్కొని క్యూ లైన్ లోనికి ప్రవేశించాలి. ఐతే ఇపుడా పద్ధతికి టీటీడీ స్వస్తి పలికి కొత్తగా ఆన్ లైన్ ద్వారానే ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్లు విక్రయించేందుకు రంగం సిద్ధం చేసింది. ఆన్ లైన్ ద్వారా రోజుకు 5 వేల టిక్కెట్లు అమ్మాలని కూడా నిర్ణయించింది. వీటిలో 2,500 టిక్కెట్లు ఈ-దర్శన్ ద్వారా, మరో 2,500 టిక్కెట్లను ఇంటర్నెట్ ద్వారా ఇంటి నుంచే బుక్ చేసుకొనే అవకాశం కల్పించారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకే ఈ సౌకర్యం ఏర్పాటు చేసినట్లు టీటీడీ పేర్కొంటోంది.
 
ఐతే ఈ సౌకర్యాన్ని కేవలం ఇంటర్నెట్ పై అవగాహన ఉన్నవారే బుక్ చేసుకోగలుగుతారు. ఐతే ఒక్కసారే వేలాది మంది సైట్ ఓపెన్ చేయడంతో సర్వర్ మొరాయిస్తోందనీ, బుక్ చేసుకోవడంలో తీవ్ర సమస్య ఎదురవుతోందని అంటున్నారు. ఇంటర్నెట్ పరిజ్ఞానం అంతగా లేని సామాన్య భక్తుల మాటేంటి అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇంతకుముందు మాదిరిగానే కనీసం కొన్ని టికెట్లయినా తిరుమల కొండపై అమ్మాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మరి తితిదే వారి విన్నపాలను పట్టించుకుంటుందో లేదో...?