శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : మంగళవారం, 23 సెప్టెంబరు 2014 (09:00 IST)

తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం!

తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు ముగింపు దశకొచ్చాయి. ప్రధాన కూడళ్లలో వివిధ దేవతామూర్తుల విద్యుత్‌ కటౌట్లు, వాహనసేవల సమయాలు తెలిపే భారీ ఆర్చిలు, ఫ్లెక్లీలు సిద్ధమయ్యాయి. ఆలయ మాడవీధులకు చలువ రంగులు, వ్యర్థాలను వేయడానికి నూతన చెత్తకుండీలు ఏర్పాటు చేశారు. నూతన రహదారులు, రోడ్లకు మరమ్మతులు, ఇతర ఏర్పాట్లను బుధవారం సాయంత్రానికి తిరుమల తిరుపతి దేవస్థానం పూర్తిచేయనుంది. 
 
భక్తుల సందర్శనార్థం పాతకొలువు మండపంలో స్వామివారి నిలువెత్తు స్వరూపాన్ని పసిడివర్ణంతో ఏర్పాటు చేశారు. అలాగే, పుష్పప్రదర్శనశాలలో సైకత శిల్పం కూడా పూర్తికావస్తోంది. కాగా, ఈసారి నాలుగు మాడవీధుల్లో పోలీసు యంత్రాంగం ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగా అక్కడక్కడా క్యాబిన్లను ఏర్పాటు చేసి, అందులో సుమారు 20 మంది పోలీసులను నియమిస్తున్నారు. అనుమానిత వ్యక్తులను వెంటనే అదుపులోకి తీసుకుని నిశితంగా పరిశీలించి, విచారిస్తున్నారు. 
 
బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు ఇవే... 
సెప్టెంబర్ 26వ తేదీ శుక్రవారం, సాయంత్రం ధ్వజారోహణం, రాత్రి పెద్ద శేష వాహనం. 
సెప్టెంబర్ 27వ తేదీ శనివారం, ఉదయం చిన్న శేష వాహనం, రాత్రి హంస వాహనం. 
సెప్టెంబర్ 28వ తేదీ ఆదివారం, ఉదయం సింహ వాహనం, రాత్రి ముత్యపు పందిరి వాహనం. 
సెప్టెంబర్ 29వ తేదీ సోమవారం, ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రి సర్వభూపాల వాహనం. 
సెప్టెంబర్ 30వ తేదీ మంగళవారం, ఉదయం మోహిని అవతారం, రాత్రి గరుడ సేవ
అక్టోబర్ 1వ తేదీ బుధవారం, ఉదయం హనుమంత వాహనం, సాయంత్రం స్వర్ణ రథ ఊరేగింపు. 
అక్టోబర్ 2వ తేదీ గురువారం, ఉదయం సర్వభూపాల వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనం. 
అక్టోబర్ 3వ తేదీ శుక్రవారం, ఉదయం రథోత్సవం, రాత్రి అశ్వ వాహనం. 
అక్టోబర్ 4వ తేదీ శనివారం, ఉదయం చక్రస్నానం. రాత్రి ధ్వజ అవరోహణం.