శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : గురువారం, 29 జనవరి 2015 (20:32 IST)

ప్రత్యేక హోదా ఇవ్వకుంటే మాకు పట్టిన గతే బీజేపీ నేతలకు పడుతుంది : ఉండవల్లి

విభజన చట్టానికి ఆమోద ముద్ర వేసే సమయంలో నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ రాజ్యసభలో చేసిన ప్రకటన మేరకు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుంటే రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ నేతలుగా తమకు పట్టిన గతే బీజేపీ నేతలకు కూడా పడుతుందని కాంగ్రెస్ మాజీ నేత, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ హెచ్చరించారు. 
 
విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేలా మన్మోహన్ సింగ్‌తో ప్రకటన చేయించింది వెంకయ్యనాయుడు కాదా అని గుర్తు చేశారు. ఈ ప్రత్యేక హోదా అంశాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టారని, ఇవాళ ప్రత్యేక హోదాను మరొక రూపంలో ఇస్తామనడం సరికాదని ఉండవల్లి అన్నారు. 
 
గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఆ హోదా ఇస్తామని చెప్పిందని, ఆ మేరకు నాటి ప్రధాని మన్మోహన్ సింగ్, కేబినెట్ నిర్ణయం తీసుకున్నదని తెలిపారు. కానీ, ఇప్పుడు ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తున్న ఇతర రాష్ట్రాలతో ఏపీని పోల్చడం సరికాదని చెప్పారు.
 
ప్రత్యేక హోదా కోసం పోరాడిన నేతల్లో వెంకయ్య నాయుడు ఒకరనే విషయాన్ని మరిచిపోజాలరని ఆయన గుర్తు చేశారు. కానీ, ఇపుడు ఇతర రాష్ట్రాలతో లంకె పెట్టి ప్రత్యేక హోదాపై పిల్లి మొగ్గలు వేయడం ఏమాత్రం భావ్యం కాదని, ఇతర రాష్ట్రాలతో ముడిపెట్టే వెంకయ్య.. ఆ రాష్ట్రాలను విడగొట్టారో లేదో ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. రాష్ట్రాన్ని విడగొట్టడంవల్ల ప్రజల్లో కోపం, బాధ ఇంకా తగ్గలేదని గుర్తు చేశారు.