శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 20 మే 2017 (15:26 IST)

మోడీని జగన్ కలిస్తే టీడీపీ నేతలకు గుబులెందుకు : వెంకయ్య ప్రశ్న

ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఒక రాష్ట్రానికి చెందిన విపక్షనేత వైఎస్.జగన్ మోహన్ రెడ్డి కలిస్తే ఏపీలోని అధికార తెలుగుదేశం పార్టీనేతలకు గుబులు ఎందుకని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ప్రశ్నించారు. అసలు ఈ అంశ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఒక రాష్ట్రానికి చెందిన విపక్షనేత వైఎస్.జగన్ మోహన్ రెడ్డి కలిస్తే ఏపీలోని అధికార తెలుగుదేశం పార్టీనేతలకు గుబులు ఎందుకని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ప్రశ్నించారు. అసలు ఈ అంశంపై రాద్దాంతం చేయాల్సిన అవసరం ఏముందని ఆయన నిలదీశారు. 
 
ఐక్యరాజ్యసమితి ఆవాస అధ్యక్షుడిగా వెంకయ్యనాయుడు ఎంపికైన సందర్భంగా విజయవాడలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడిన వెంకయ్య.. విపక్షనేత ప్రధానిని జగన్ కలిస్తే ఎందుకు తర్జనభర్జన పడుతున్నారో అర్ధంకావడం లేదన్నారు. రాష్ట్రపతి ఎన్నికకు ఏ పార్టీ మద్దతు ఇచ్చినా తీసుకుంటామని స్పష్టం చేశారు.
 
ప్రస్తుతం టీడీపీతో పొత్తు కొనసాగుతుంది.. 2019 ఎన్నికలప్పుడు పొత్తు ఎవరితో అన్నది ఆలోచిస్తామన్నారు. ఈనెల 25న విజయవాడలోజరగనున్న కార్యకర్తల సమావేశానికి అమిత్‌షా హాజరవుతారని తెలిపారు. మహాకూటమితో ఎన్డీఏకు ఇబ్బంది లేదంటూ వెంకయ్య చెప్పుకొచ్చారు.
 
ఇకపోతే.. దక్షిణాదిలో బీజేపీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఏపీలో పర్యటిస్తారని, సభలో పాల్గొంటారని చెప్పారు. బూత్ స్థాయి కార్యకర్తలతో అమిత్ షా భేటీ అవుతారని, ఆహ్వానం ఉన్న వారిని మాత్రమే అనుమతిస్తారని చెప్పారు. 
 
దక్షిణాదిలో 120 ఎంపీ స్థానాల్లో ఉన్నామని, దేశంలో ఎన్డీయే మినహా ఇతర పక్షాలన్నీ దిక్కుతోచని స్థితిలో ఉన్నాయని, ప్రతిపక్ష పార్టీలన్నీ మహాకూటమి ఏర్పాటు చేస్తామంటున్నాయని అన్నారు. తమిళనాడు రాజకీయాల్లో కలుగజేసుకోమని తేల్చి చెప్పారు.