శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Updated : గురువారం, 1 అక్టోబరు 2015 (12:04 IST)

వైద్యశాఖలో సీమకు మరో అన్యాయం.. రూ. 65 కోట్ల నిధుల విశాఖకు మళ్ళింపు..?

రాయలసీమ వచ్చిన నిధులను పథకాలను కూడా కోస్తా జిల్లాలకు తన్నుకుపోతున్నారు. నిన్నటికి నిన్న తిరుపతి పద్మావతీ మెడికల్ కాలేజీలో 97 సీట్లను గల్లంతు చేస్తే.. తాజాగా అనంతపురం ప్రభుత్వ వైద్య కళాశాలకు మంజూరయిన నిధులను విశాఖ జనరల్ ఆసుపత్రికి తరలించారు. అలాగే ఓ ప్రత్యేక ఎంఆర్ఐ స్కానింగ్ యంత్రాన్ని కూడా తరలించేశారు. అయినా సీమ నుంచి నోరు మెదిపే నాయకుడి జాడ కనిపించడం లేదు. 
 
కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో కోస్తా నాయకులు ఉన్నంత హుషారుగా రాయలసీమ నాయకులు లేరనే విషయం ఒక్కొక్కటిగా స్పష్టమవుతున్నాయి. తిరుపతి పద్మావతి వైద్యకళాశాల సీట్లు పూర్తిగా 107 సీట్లు వస్తాయి. అయితే కోస్తా నాయకులు రాత్రికి రాత్రే ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చారు.గుట్టుచప్పుడు కాకుండా వచ్చిన 120 జీవోతో తిరుపతి పద్మావతీ వైద్య కళాశాల సీట్లు రాష్ట్రవ్యాప్తంగా మారిపోయాయి. దీంతో సీమ విద్యార్థులు 95 మెడికల్ సీట్లను కోల్పోయారు. అవన్నీ కోస్తా జిల్లాల విద్యార్థులతో నింపేశారు. దీనిపై కోర్టుకెక్కి సీమవాసులకు ఊరట లభించింది. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి స్థానికులకు కేటాయించాలని ఆదేశించింది. 
 
ఇదిలా ఉండగా గుంటూరు, అనంతపురం జిల్లాలోని వైద్య కళాశాలలకు ప్రత్యేక నిధులను మంజూరు చేశారు. ఈ విషయం రెండు నెలల కిందటే అనంతపురం వైద్య కళాశాలకు సమాచారం వచ్చింది. అందులో భాగంగా రేడియాలజీ విభాగానికి రూ.7కోట్లు ఖరీదు చేసే అధునాతన ఎంఆర్‌ఐ స్కానింగ్‌ యంత్రాన్ని మంజూరు చేశారు. ఈ మేరకు సమాచారం అందడంతో వైద్య కళాశాల ప్రత్యేకమైన గదిని కూడా నిర్మించింది. 
 
ఇదిలా ఉండగానే రూ. 7 కోట్ల విలువ చేసే స్కానింగ్ పరికరం మంజూరైందని తెలుసుకున్న కోస్తా నాయకులు దానిని విశాఖ ప్రభుత్వ ఆసుపత్రికి తన్నుకుపోయినట్లు తెలుస్తోంది. అలాగే అనంతపురం ప్రభుత్వ వైద్య కళాశాలకు మంజూరైన ఆ రూ.65కోట్లును కూడా దారి మళ్ళించే ప్రయత్నాలు ఓ దశకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నిధులను కూడా అక్కడికే ఇవ్వడానికి దారి మళ్లింపు దస్త్రాలపై సంతకాలన్నీ పూర్తయ్యాయి. 
 
రాష్ట్ర వైద్య విద్యాశాఖలోని ఉన్నత అధికారి సొంత జిల్లా విశాఖ కావడంతోనే ఆయన తన సొంత జిల్లాపై ప్రేమ చూపుతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఈ నిధులను నాయకుల సహకారంతో తన్నుకుపోతున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం ప్రభుత్వానికి అత్యధిక స్థానాలను ఇచ్చిన అనంతకు తీరని అన్యాయమే జరుగుతోంది. అయితే ఈ జిల్లాకు మంజూరైన నిధులు, వైద్య పరికరాలు సైతం ఇతర జిల్లాకు తరలివెళ్లడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది ప్రభుత్వంలో రాయలసీమ ప్రాంతంపై ఉన్న నిర్లక్ష్యానికి, ఇక్కడి నాయకుల అసమర్థతకు అద్దం పడుతున్నాయనే నిరసనలు జోరుగా సాగుతున్నాయి.