శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 21 ఆగస్టు 2014 (17:40 IST)

చిరంజీవి కొంపముంచిన వాస్తు: మెగాస్టార్.. మూగస్టార్‌గా...?

ఒకప్పుడు అన్నయ్య అంటేనే పవర్.. మరి ఆ పవర్ ఇప్పుడేమైంది. సినిమాల్లో ఓ వెలుగు వెలిగిన చిరంజీవికి ఆ పరమితి ఎందుకు దారుణంగా తగ్గిపోయింది. సినిమాల్లో మెగాస్టార్‌గా రాణించిన చిరంజీవి.. రాజకీయాల్లో మాత్రం మూగస్టార్‌గా మారిపోవడానికి కారణమేమిటని ఆరాతీస్తే.. అన్నయ్యకు చిరంజీవి రాజకీయాల్లో పరిపక్వత లేకపోవడం, ప్రజల నమ్మకాన్ని చూరగొనకపోవడం వంటి కారణాలేనని రాజకీయ పండితులు అంటున్నారు. ఇవన్నీ ఒక ఎత్తయితే ఆయన రాజకీయాల్లో రాణించలేకపోవడానికి వాస్తు దోషం కూడా ఓ కారణమంటూ వార్తలొస్తున్నాయి. 
 
రాజకీయంగా చిరంజీవి కొంప మునిగిపోవడానికి వాస్తు కారణమని పరిశీలకులు అంటున్నారు. చిరంజీవి తన సొంత పార్టీని మూసేసిన తర్వాత రాజకీయం ఆయన పరువు సగం పోయింది. కాంగ్రెస్ పార్టీలో చేరి, ఎంపీ అయి, కేంద్రమంత్రి కూడా అయిన తర్వాత ఆ పరువు పూర్తిగా పోయింది. 
 
రాష్ట్ర విభజన తర్వాత మొత్తం తుడిచిపెట్టుకుని పోయింది. చిరంజీవికి ఎవరైనా అభిమానులు అనేవాళ్ళు మిగిలి వుంటే వాళ్ళు బాధపడతారేమోగానీ, ప్రస్తుతం ఏదో రాజ్యసభ పదవి ఉన్నప్పటికీ, ఆయన రాజకీయంగా జీరో అయిపోయారు. 
 
భవిష్యత్తులో హీరో అవుతారన్న నమ్మకం ఆయనకయినా వుందో, లేదో తెలియదు కానీ మెగాస్టార్ క్రేజ్ టోటల్‌గా తగ్గిపోయింది. ఇందుకు ఉదాహరణ ఆయన బర్త్ డేనే. మెగాస్టార్‌గా ఉన్నప్పుడు అన్నయ్య బర్త్ డే అంటేనే అభిమానులు చేసే హంగామా అంతా ఇంతాకాదు. కానీ ప్రస్తుతం ఆయన పరిస్థితి.. చిరు బర్త్ డే అన్నా కూడా పిన్ డ్రాప్ సైలెన్స్‌గా మారిపోయింది. 
 
ఇదిలా వుంటే, చిరంజీవి రాజకీయంగా పూర్తిగా దెబ్బయిపోవడానికి ఢిల్లీలో ఆయన అధికార నివాస గృహం వాస్తు అష్ట దరిద్రంగా వుండటమే కారణమని తెలుస్తోంది. 
 
రాజ్యసభ సభ్యత్వం, కేంద్ర మంత్రి పదవి దక్కిన తర్వాత చిరంజీవికి ఢిల్లీ అక్బర్ రోడ్డులో ఒక బంగ్లాని కేటాయించారు. అంతేగాకుండా ప్రభుత్వ సొమ్ము ఖర్చుపెట్టి ఆ బంగ్లాకి రకరకాల హంగూ ఆర్భాటాలు చేయించారు. అత్యాధునిక లుక్కు తెచ్చారు. 
 
అయితే పైపై అలంకారాలే తప్ప ఆ ఇంటికి వాస్తు ఎంతమాత్రం బాగాలేదట. పాపం చిరంజీవి ఆ ఇంటికి మేకప్ అయితే వేయగలిగారుగానీ, వాస్తు దోషముందనే విషయాన్ని కనిపెట్టలేకపోయారు. ఈ విషయాన్ని ప్రస్తుత ఎన్డీయే హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గుర్తించారు. వాస్తు దోషముందని రాజ్‌నాథ్ సింగ్ కనిపెట్టడమే కాకుండా ఆ బంగ్లాకు తాను షిఫ్ట్ కావాలనే ఆలోచనను వాయిదా వేసుకున్నారని తెలుస్తోంది. 
 
కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చిరంజీవి నివాస భవనాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కి కేటాయించారు. అయితే చిరంజీవి ప్రస్తుత నివాసానికి రావడానికి రాజ్‌నాథ్ ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది. 
 
ఆ ఇల్లు వాస్తుపరంగా ఘోరంగా వుంటుందని, ఆ ఇంటికి వెళ్ళలేనని చెప్పడంతో చిరంజీవికి కాస్త ఊరట కలిగినా.. అమ్మో ఇన్నాళ్ళు ఈ కొంపలోనే వున్నామా అనుకుంటున్నారట. రాజ్ నాథ్ సింగ్ రాకపోతే పోనీ కానీ ముందు ఆ బంగ్లా ఖాళీ చేసేయాలని చిరంజీవి అనుకుంటున్నట్లు తెలిసింది.