బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : శనివారం, 24 జనవరి 2015 (17:11 IST)

దేశాభివృద్ధి కోసమే ఎఫ్‌డీఐలకు అనుమతి : వెంకయ్య నాయుడు

దేశాభివృద్ధిని దృష్టిలో ఉంచుకునే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానిస్తున్నట్టు కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ నేత వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎన్ని విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
 
విజయవాడలో శనివారం జరిగిన ఏపీ ఛాంబర్ ఆప్ కామర్స్ సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. దేశ ఆర్థక వ్యవస్థను గాడిన పెట్టేందుకు సంస్కరణల బాట పట్టక తప్పదన్న ఆయన, మాజీ ప్రధానమంత్రి, భారతరత్న వాజ్‌పేయి ప్రవేశపెట్టిన సంస్కరణలు దేశానికి ఆర్థిక పరంగా జవసత్వాలను ఇచ్చాయన్నారు.
 
మేక్ ఇన్ ఇండియాతో భారత్ పారిశ్రామిక వృద్ధి పరుగులు పెట్టనుందన్నారు. దేశంలోకి పెట్టుబడులు పెద్ద ఎత్తున వస్తున్నాయని, వాటిని సద్వినియోగం చేసుకునేందుకు అడ్డంకులను తొలగించాల్సిన అవసరం ఉందని వెంకయ్య నొక్కివక్కాణించారు.
 
అంతకుముందు ఆయన నవ్యాంధ్రలోనూ కొత్తగా కార్యాలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. విజయవాడ సమీపంలోని తాడేపల్లి వద్ద కృష్ణా కరకట్ట పక్కగా పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్టీ కార్యాలయ నిర్మాణంలో ఎలాంటి నిబంధనలను అతిక్రమించొద్దని పార్టీ శ్రేణులకు సూచించారు. అన్ని అనుమతులు మంజూరైన తర్వాతే నిర్మాణ పనులను ప్రారంభించాలని ఆయన పేర్కొన్నారు.